Kolkata : పశ్చిమబెంగాల్‌లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం
ABN, Publish Date - Aug 11 , 2024 | 05:03 AM
కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ) వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.
జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం
గురువారం రాత్రి విధుల్లో.. శుక్రవారం ఉదయం అర్ధనగ్న స్థితిలో శవమై..
ఆర్‌జీ కర్ ప్రభుత్వ వైద్య కాలేజీలో ఘటన
అనుమానితుడి అరెస్టు.. రిమాండ్
ఉరి వేయించడానికీ వెనకాడం: మమత
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని సీఎం మమత ఆదేశం
కోల్‌కతా, ఆగస్టు 10: కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ) వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు. పీజీ సెకండియర్ చదువుతున్న ఆమె.. గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు.
ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమిక శవపరీక్షలో నిర్ధారణ అయింది. మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు తేలింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆమె హత్యకు గురై ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉందన్న అనుమానంతో ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
అతను బయటి వ్యక్తి అని, ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో స్వేచ్ఛగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీ, విరిగిపోయిన బ్లూటూత్ పరికరం(ఇయర్‌బడ్) ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో వాస్తవాలను దాచిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మృతురాలి తండ్రి ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని శనివారం కోర్టులో హాజరుపర్చగా.. జడ్జి 14 రోజుల పోలీస్ రిమాండ్‌కు అనుమతి ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశామని కోల్‌కతా పోలీస్ కమిషనర్ విన్సెంట్ చెప్పారు.
అవసరమైతే ఉరి శిక్ష వేయిస్తాం: మమత
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే హంతకుడికి ఉరి శిక్ష వేయించడానికి కూడా తమ ప్రభుత్వం వెనకాడదన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చిన ఆమె, తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఈ కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, వైద్యురాలి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
Updated Date - Aug 11 , 2024 | 05:03 AM