ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Narendra Modi: అబద్ధాలు.. పిల్లచేష్టలు!

ABN, Publish Date - Jul 03 , 2024 | 04:24 AM

కాంగ్రెస్‌ పార్టీ దేశంలో అరాచకత్వాన్ని వ్యాపింపజేయాలని చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.

PM Modi

  • రాహుల్‌గాంధీపై ప్రధాని ధ్వజం

  • రిజర్వేషన్లు, అగ్నిపథ్‌, ఎమ్మెస్పీ సహా

  • అనేక విషయాలపై అసత్య ప్రచారం

  • హిందువులపై దుష్ప్రచారం ఒక కుట్ర

  • ‘నీట్‌’ బాధ్యుల్ని క్షమించేది లేదు: మోదీ

  • 3 రెట్లు వేగంగా పనిచేసేందుకే ప్రజలు

  • మూడోసారి గెలిపించారని వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ దేశంలో అరాచకత్వాన్ని వ్యాపింపజేయాలని చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. రిజర్వేషన్లు, రక్షణ నియామకాలు, ఎమ్మెస్పీ సహా అనేక విషయాలపై అసత్యాలు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీపైనా, రాహుల్‌ గాంధీపైనా విరుచుకుపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశం కోరుకుంటోందని స్పీకర్‌కు తెలిపారు. ప్రతిపక్ష నేతలు పిల్లచేష్టలకు పాల్పడుతున్నారంటూ పరోక్షంగా రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. గతంలో కౌగిలించుకోవడం, కన్ను గీటడం వంటి పనులకు పాల్పడ్డారని.. ఇప్పుడు దేవుళ్లను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. హిందూ ఉగ్రవాదం వంటి పదాలను వాడడం, మతాన్ని డెంగీ, మలేరియాతో పోల్చడం సరికాదని, దేశం ఇలాంటి వాటిని క్షమించదని చెప్పారు. హిందువులకు వ్యతిరేకంగా తప్పుడు ప్రకటనలు చేయడాన్ని తీవ్రమైన కుట్రగా అభివర్ణించారు. పదేళ్లలో తమ ప్రభుత్వ పనితీరు చూసిన ప్రజలు.. మరింత బాగా పనిచేసేందుకే మూడోసారి గెలిపించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గతంలో కంటే మూడు రెట్లు వేగంగా పనిచేస్తామన్నారు. అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్డీయేకు ప్రజలు మెజారిటీ సీట్లు కట్టబెట్టారంటూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీలో ఎన్డీయేకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. దేశంలో సుస్థిరతకు, నిరంతర సుపరిపాలనకు అవకాశం కల్పించారని అన్నారు.


విచ్ఛిన్నకర రాజకీయాలు..

అవినీతి కేసుల్లో రాహుల్‌ బెయిల్‌పై ఉన్నారని, పలు పరువునష్టం కేసులను ఎదుర్కొంటున్నారని, ఓబీసీలను అవమానపరిచినందుకు ఆయనకు శిక్షపడిందని మోదీ గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ముందు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక విధానాల ద్వారా అరాచకత్వాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. కులాలు, మతాలతో విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ను నెహ్రూ అవమానించారని, ఎన్నికల్లో ఓడించారని, జగ్జీవన్‌ రామ్‌ ప్రధాని కాకుండా ఇందిరా గాంధీ అడ్డుపడ్డారని, రాజీవ్‌ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. తాము జమ్మూకశ్మీరులో 370 అధికరణను రద్దు చేశామని, ఒకప్పుడు రాళ్లు రువ్విన ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ మాదిరి బుజ్జగింపు రాజకీయాలు కాకుండా అందరికీ న్యాయం చేయడమే తమ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. అవినీతిని సహించబోమన్నారు. 25 కోట్లమంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసినందుకే తాము మూడోసారి గెలిచామని తెలిపారు. అగ్నిపథ్‌ పథకంపై కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తోందని మోదీ మండిపడ్డారు. యువత సైన్యంలో చేరకుండా ఉండేలా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.


ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్నారు. రక్షణ రంగాన్ని బలహీనం చేయాలన్న కుట్రతోనే అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. భారత సాయుధ బలగాలు బలోపేతమవ్వాలని కాంగ్రెస్‌ ఎన్నడూ కోరుకోదన్నారు. గతంలో అవసరమైన మేరకు సంస్కరణలు చేయకపోవడం వల్లే సాయుధ బలగాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నాయని చెప్పారు. దేశ రక్షణకు సంబంధించిన విషయాలు బహిరంగంగా చెప్పకూడదన్నారు. అందుకే తాను స్పందించలేదని చెప్పారు. ఇక రఫేల్‌ యుద్ధ విమానాల విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేసిందని విమర్శించారు. మన బలగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా చూస్తున్నామని, అందులో భాగంగానే సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీట్‌ ప్రశ్నపత్రాల లీక్‌ గురించి ప్రధాని మాట్లాడుతూ.. నేరస్థులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అక్రమార్కులు ఎక్కడున్నా, ఎంత మంది ఉన్నా శిక్షించి తీరతామని, విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు.


ప్రతిపక్షాల నినాదాల నడుమే..

ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతున్నంత సేపూ ప్రతిపక్ష నేతలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశా రు. మణిపూర్‌పై మాట్లాడాలంటూ డిమాండ్‌ చేశారు. గందరగోళం మధ్యనే ప్రధాని తన ప్రసంగం ప్రారంభించి ముగించారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవాలని సభ్యులను రెచ్చగొడుతున్నందుకు స్పీకర్‌ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని పలుసార్లు మందలించారు.

100కి 99 కాదు.. 543కు 99..

కాంగ్రెస్‌ పార్టీ గత మూడు ఎన్నికల్లో వంద సీట్లు కూడా సాధించలేకపోయిందని మోదీ గుర్తుచేశారు. అయినా తాము గెలిచామన్న సంబరం వారిలో కనిపించడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్నపిల్లవాడు సైకిల్‌ తొక్కుతూ కింద పడిపోతే అతని దృష్టి మళ్లించేందుకు అదిగో చీమ చనిపోయిందని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారని, కాంగ్రెస్‌ నేతలు కూడా రాహుల్‌ను అలాగే సంతోషపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక విద్యార్థికి 100కి 99 మార్కులు వస్తే అందరూ అభినందిస్తారని, కానీ.. అతనికి 543కి 99 మార్కులు వచ్చిన విషయం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అంతేగాక కాంగ్రె్‌సను ఇతర పార్టీలపై ఆధారపడిన పరాన్న జీవిగా మోదీ అభివర్ణించారు. ముఖాముఖి పోరులో కాంగ్రెస్‌ విజయం సాధించలేదని, మిత్రపక్షాల భుజాలపై ఎక్కి కొన్ని సీట్లు గెలుచుకుందని చెప్పారు. ప్రజలు కాంగ్రె్‌సను ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు ఇచ్చారన్నారు. ఆ విషయాన్ని ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

For More National News and Telugu News..

Updated Date - Jul 03 , 2024 | 09:13 AM

Advertising
Advertising