Madhya Pradesh: ఇళ్లు కూల్చేయడం ఫ్యాషన్ గా మారింది.. బుల్డోజర్ చర్యపై హైకోర్టు ఆగ్రహం..
ABN, Publish Date - Feb 12 , 2024 | 03:49 PM
క్రిమినల్ కేసుల్లో నిందితులపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు తప్పుబట్టింది. అధికారులు సరైన విధానం అనుసరించకుండా ఇళ్లను కూల్చివేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
క్రిమినల్ కేసుల్లో నిందితులపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు తప్పుబట్టింది. అధికారులు సరైన విధానం అనుసరించకుండా ఇళ్లను కూల్చివేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ లాంగ్రీ ఇంటి కూల్చివేతకు సంబంధించిన కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తిని బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించారనే ఆరోపణలతో లాంగ్రీని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు అతని రెండస్థుల భవనాన్ని కూల్చివేశారు.
ఈ ఘటనపై లాంగ్రీ భార్య రాధ కోర్టును ఆశ్రయించింది. నోటీసులు ఇచ్చారని కానీ వాటి గురించి వివరించేందుకు సమయం ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. తమ వాదనను వినకండా ఇంటిని కూల్చివేశారని తెలిపారు. తాము కట్టుకున్న ఈ ఇల్లు చట్టవిరుద్ధం కాదని, హౌసింగ్ బోర్డులో రిజిస్టర్ అయిందని పేర్కొన్నారు. అంతే కాకుండా బ్యాంకు రుణం తీసుకున్నామని పిటిషన్ లో వివరించారు.
ఈ కేసుపై విచారించిన జస్టిస్ వివేక్ రుషియా నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేత చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చింది. రాధా లాంగ్రీతో పాటు ఆమె అత్తగారికి ఒక్కో రూ.లక్ష అందించాలని ఆదేశించింది. కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. స్థానిక పరిపాలన, స్థానిక సంస్థలు న్యాయ సూత్రాలు పాటించకుండా ప్రొసీడింగ్‌లు రూపొందించి, ఏ ఇంటినైనా కూల్చేసి వార్తాపత్రికలో ప్రచురించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 12 , 2024 | 03:50 PM