Mamata Banerjee: మీరు మా దేశాన్ని కబ్జా చేస్తుంటే... లాలీపాప్ తింటూ కూర్చుంటామా?
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:37 AM
పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా రాష్ట్రాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ నాయకుల వ్యాఖ్యలపై మమత ఆగ్రహం
న్యూఢిల్లీ, డిసెంబరు 9: పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా రాష్ట్రాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత భూభాగాలను ఆక్రమించుకోవడానికి బాహ్య శక్తులు ప్రయత్నిస్తుంటే భారతీయులు లాలీపాప్ తింటూ కూర్చుంటారని పొరుగు దేశం భావిస్తోందా అని ప్రశ్నించారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆమె ప్రసంగించారు. కొందరు బంగ్లాదేశ్ నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించవద్దని, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢాకా సభలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడు రుహుల్ కబీర్ రిజ్వీ మాట్లాడుతూ బెంగాల్, బిహార్, ఒడిశాపై బంగ్లాదేశ్‌కు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేటప్పుడు బాధ్యతగా ఉండాలని రాజకీయ ప్రత్యర్థులు, మీడియా సంస్థలతో సహా అన్ని పార్టీలను మమత హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి విషమిస్తే అక్కడున్న మన బంధువులు, స్నేహితులపై ప్రభావం పడుతుంది కాబట్టి, సంయమనం పాటించాలని కోరారు. విదేశాంగ శాఖ మార్గదర్శకాలకు తమ ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉంటాయని మమత స్పష్టం చేశారు.