BJP: రాష్ట్ర కమల దళాధిపతిగా నయినార్ నాగేంద్రన్
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:48 AM
తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడుగా నయినార్ నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు. అధ్యక్ష్య పదవికి జరిగిన ఎన్నికల్లో నయినార్ నాగేంద్రన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అధికారిక ప్రకటన లాంఛనమే అయింది.

- ఏకైక నామినేషన్ దాఖలు
- అధ్యక్ష పదవి లాంఛనమే
- నేడు ప్రకటించే అవకాశం
చెన్నై: రాష్ట్ర కమల దళాధిపతిగా తిరునల్వేలి ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్(Tirunelveli MLA Nainar Nagendran) పదవిని అధిరోహించడం ఖాయమైపోయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్య పదవికి జరిగిన ఎన్నికల్లో నయినార్ నాగేంద్రన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అధికారిక ప్రకటన లాంఛనమే అయింది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం శనివారం ప్రకటించనుంది. పార్టీ నిర్వహణ రీత్యా రాష్ట్ర బీజేపీలో 67 జిల్లాలున్నాయి. పార్టీలో కొత్త సభ్యుల చేరిక గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభించారు. అనంతరం నవంబరులో శాఖల స్థాయిలో ఎన్నికలు చేపట్టి నిర్వాహకులను ఎంపిక చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Railway Jobs: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులు
తదుపరి మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో కొత్త జిల్లా అధ్యక్షులు నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు పదవికి జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సహా వివిధ కారణాలతో అధ్యక్ష పదవి ఎన్నికలో జాప్యం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి శనివారం ఎన్నిక జరగనుందని ప్రకటించారు. ఈ పదవికి పోటీచేసే అభ్యర్థులు, శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలని ఎన్నికల నిర్వాహకులు ప్రకటించారు.
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నయినార్ నాగేంద్రన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. నాగేంద్రన్ నామినేషన్‌ను ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షుడు పొన్.రాధాకృష్ణన్, హెచ్.రాజా, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్, కనక సభాపతి, వీపీ దురైస్వామి, పొన్ బాలగణపతి తదితరులు బలపరిచారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నాగేంద్రన్‌కు పార్టీ సీనియర్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ సాయంత్రం 4 గంటలకు ముగియగా, ఇతరులెవ్వరూ దాఖలు చేయకపోవడంతో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నయినార్ నాగేంద్రన్ ఎన్నిక ఖరారైపోయింది.
చివరి నిమిషంలో మారిన నిబంధన...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ సర్వసభ్య మండలి సభ్యులు తదితర పదవుల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే నేతలకు పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉండాలంటూ గురువారం ప్రకటించారు. కానీ, ఈ పదవికి పోటీ చేస్తారని భావించిన అన్నామలై, నయినార్ నాగేంద్రన్‌కు పదేళ్ల పార్టీ సభ్యత్వం లేకపోయింది. దీంతో, శుక్రవారం నామినేషన్ల సమయంలో కొంత గందరగోళం నెలకొంది. అంతలోనే పోటీ చేసే అభ్యర్థులకు విధించిన నిబంధనలను సడలించారు. ఆంధ్ర, సిక్కిం రాష్ట్రాల అధ్యక్ష పదవుల ఎన్నిక సందర్భంగా, 10 ఏళ్ల ప్రాథమిక సభ్యత్వం నుంచి మినహాయింపు కల్పించినట్లు పార్టీ చివరి నిమిషంలో ప్రకటించడంతో, నయినార్ నాగేంద్రన్ నామినేషన్ దాఖలుచేశారు.
అన్నాడీఎంకేతో రాజకీయ ప్రస్థానం...
రాష్ట్ర కమల దళాధిపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న దేవర్ సామాజిక వర్గానికి చెందిన 64 ఏళ్ల నయినార్ నాగేంద్రన్ రాజకీయ జీవితం అన్నాడీఎంకేతో మొదలైంది. తిరునల్వేలి జిల్లా పనకుడి సమీపం తండయార్‌కుళానికి చెందిన నాగేంద్రన్ పీజీ డిగ్రీ చేశారు. ఆయనకు భార్య చంద్ర, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1989లో అన్నాడీఎంకేలో చేరిన నాగేంద్రన్, పనకుడి నగర కార్యదర్శి, యువజన విభాగం కార్యదర్శి, తిరునల్వేలి నగర జిల్లా జయలలిత పేరవై కార్యదర్శి, రాష్ట్ర జయలలిత పేరవై కార్యదర్శి, ఎన్నికల విభాగం సంయుక్త కార్యదర్శి తదితర పదవులు నిర్వహించారు.
విద్యుత్, కార్మికశాఖ మంత్రిగా...
2001 తిరునల్వేలి శాసనసభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి విజయం సాధించి, నాటి ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో విద్యుత్, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. మళ్లీ 2006లో తిరునల్వేలి నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2011లో జరిగిన ఎన్నికల్లో తిరునల్వేలి నియోజకవర్గం నుంచి ఎన్నికైనా, ఆయనకు మంత్రి పదవి లభించలేదు.
బీజేపీలో చేరిక...
2016లో మళ్లీ తిరునల్వేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి వైదొలిగి 2017లో బీజేపీలో చేరారు. అప్పటినుంచి బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2019లో రామనాథపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి పరాజయం చవిచూశారు. అనంతరం 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరునల్వేలి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసే అవకాశం దక్కింది. ఆయనకు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రచారం చేశా రు. ఈఎన్నికల్లో నయినార్ నాగేంద్రన్ విజయం సాధించి, బీజేపీ శాసనసభ పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తిరునల్వేలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాగేంద్రన్, కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ బ్రూస్ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!
రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్
Read Latest Telangana News and National News