Rahul Gandhi: పెద్ద పెద్ద కార్పొరేట్లకు మేలుతో యువతకు ఉద్యోగాలొస్తాయా?
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:25 AM
యువతకు ఉపాధి కల్పనపై ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మూడు ప్రశ్నలు సంధించారు. పెద్దపెద్ద కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చి.. చిన్న పరిశ్రమలను పక్కనపెడితే ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

ఎన్నికలప్పుడు చెప్పిన ఈఎల్‌ఐ స్కీమ్ ఏది.. ప్రధానిపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): యువతకు ఉపాధి కల్పనపై ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మూడు ప్రశ్నలు సంధించారు. పెద్దపెద్ద కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చి.. చిన్న పరిశ్రమలను పక్కనపెడితే ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 2024 ఎన్నికల ముందు ప్రధాని ఆర్భాటంగా ప్రకటించిన ఉపాధి ఆధారిత రాయితీ (ఈఎల్‌ఐ) పథకం ఏమైందని నిలదీశారు. దేశ యువతకు అత్యవసరమైన ఉపాధి కల్పనపై ఆయనకు నిర్మాణాత్మక ప్రణాళిక ఉందా.. లేక ఇది కూడా శుష్క వాగ్దానమేనా అని శుక్రవారం ‘ఎక్స్’లో ప్రశ్నించారు.
ఈఎల్‌ఐ స్కీంపై కార్యాచరణే సిద్ధం కాలేదని.. నియమ నిబంధనలు రూపొందించలేదని.. బడ్జెట్‌లో దానికి కేటాయించిన రూ.10 వేల కోట్లు ఎక్కడకు వెళ్లాయని నిలదీశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ఆయన చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. స్వదేశీ పెట్టుబడులను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కూడా దాదాపు అంతరించే దశలో ఉన్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా ఆరోపించారు. భయపెట్టడం, మోసగించడం, బెదిరించడం అనే విధానాల వల్లే ఈ దుర్గతి పట్టిందని ‘ఎక్స్’లో ధ్వజమెత్తారు.