రెండు యుద్ధాలు జరుగుతుంటే.. ఐక్యరాజ్యసమితి ఎక్కడ?
ABN , Publish Date - Oct 07 , 2024 | 04:18 AM
ప్రపంచంలో నేడు రెండు యుద్ధాలు జరుగుతుంటే.. ఐక్యరాజ్యసమితి ఎక్కడుందని భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ ప్రశ్నించారు. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 6: ప్రపంచంలో నేడు రెండు యుద్ధాలు జరుగుతుంటే.. ఐక్యరాజ్యసమితి ఎక్కడుందని భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ ప్రశ్నించారు. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మూడు రోజులు నిర్వహించిన కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్‌లో చివరిరోజైన ఆదివారం ఆయన ప్రసంగించారు. యుద్ధాలు జరుగుతుంటే ఐక్యరాజ్యసమితి ప్రేక్షక పాత్రకే పరిమితమైందని, మార్కెట్‌లో మనుగడలేని ఒక పాత కంపెనీలాగా దాని తీరు ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు. సంక్షోభాలను పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి ఏమీ చేయలేకపోతోందని పేర్కొన్నారు. భద్రతామండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచడం సహా ఐక్యరాజ్యసమితిని సంస్కరించాలని గత కొన్నేళ్లుగా భారత్ డిమాండ్ చేస్తోంది.
నవరాత్రులు కదా! ఉపవాసం చేస్తున్నా..
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, హంగేరియన్-అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరో్‌సలలో ఎవరితో డిన్నర్‌కు ప్రాధాన్యం ఇస్తారనే ప్రశ్నకు జైశంకర్ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూ సందర్భంగా జైశంకర్‌ను ఈ విధంగా ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం నవరాత్రులు కదా!.. నేను ఉపవాసంలో ఉన్నా’ అని నవ్వుతూ జైశంకర్ సమాధానం ఇచ్చారు. కాగా, జార్జ్ సోరోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శిస్తుంటారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు జార్జ్ సోరోస్ నిధులు సమకూరుస్తున్నారని బీజేపీ తరచుగా ఆరోపిస్తోంది.