ఒక్కో జంట 16 మంది పిల్లల్ని కనాలేమో!
ABN, Publish Date - Oct 22 , 2024 | 04:11 AM
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘డీలిమిటేషన్’తో ఇలాగే ఆలోచించాల్సి వస్తుందేమో: తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ కారణంగా రాష్ట్రంలో ఎంపీ స్థానాలు తగ్గే పరిస్థితి తలెత్తుతున్నప్పుడు.. పిల్లల్ని కనే విషయంలో పరిమితులు ఎందుకు విధించుకోవాలనే ఆలోచన వస్తోందన్నారు. చెన్నైలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 31 జంటలకు సామూహిక వివాహాలు జరిపించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పూర్వం కొత్తగా పెళ్లయిన జంటలను పెద్దలు.. 16 సంపదలతో వర్థిల్లాలని ఆశీర్వదించేవారు. ఇప్పుడు 16 సంపదలకు బదులుగా 16 మంది పిల్లల్ని కనాల్సిందిగా దీవించాల్సివస్తుందేమో!’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన విధానాన్ని చూస్తే ఇలాగే ఆలోచించాలేమోనన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 04:11 AM