సిద్దరామయ్య భార్యకు స్థలాల కేటాయింపు రద్దు
ABN, Publish Date - Oct 02 , 2024 | 03:57 AM
కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి భూసమీకరణలో పరిహారం కింద ఇచ్చిన 14 ప్లాట్ల కేటాయింపును ముడా(మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) రద్దు చేసింది.
బెంగళూరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి భూసమీకరణలో పరిహారం కింద ఇచ్చిన 14 ప్లాట్ల కేటాయింపును ముడా(మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) రద్దు చేసింది. ఆ స్థలాలపై ఎటువంటి లావాదేవీలూ నిర్వహించే అధికారం ఇకపై వారికి లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతకుముందు ఆ 14 ప్లాట్లలో లోకాయుక్త పోలీసులు సర్వే నిర్వహించారు. ఈ ప్లాట్ల కేటాయింపు వివాదాస్పదమైన నేపథ్యంలో లోకాయుక్త పోలీసులు సెప్టెంబరు 27న కేసు నమోదు చేయగా, ఆ ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు సోమవారం సిద్దరామయ్య, పార్వతి తదితరులపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్లాట్లను ముడాకు తిరిగి అప్పగించడం.. వారు తప్పు చేశారని ఒప్పుకోవడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు. కేసుల నుంచి తప్పించుకోడానికే ఇలా రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు. సిద్దరామయ్య మొండిపట్టు వీడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. కాగా, ముడా స్థలాలకు మనీలాండరింగ్ నిబంధనలు ఎలా వర్తిస్తాయో తనకు అర్థం కావడం లేదని సిద్దరామయ్య మంగళవారం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Updated Date - Oct 02 , 2024 | 03:57 AM