ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Muslim Women: సెక్షన్‌ 125 కింద ముస్లిం మహిళలూ భరణానికి అర్హులే

ABN, Publish Date - Jul 11 , 2024 | 04:48 AM

భర్త నుంచి భరణం కోరే హక్కును భార్యకు ఇచ్చే సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 దేశంలోని వివాహితలు అందరికీ మతాతీతంగా వర్తిస్తుందని తేల్చిచెప్పింది.

  • సీఆర్పీసీలోని ఆ సెక్షన్‌ మతాలకు అతీతమైంది

  • భరణం దయతో ఇచ్చేది కాదు.. అది వివాహిత మహిళల హక్కు

  • ఆ సెక్షన్‌ మతాలకు అతీతమైంది

  • భరణం.. ‘దయ’ కాదు.. హక్కు

  • సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

ముస్లిం మహిళల భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది! భర్త నుంచి భరణం కోరే హక్కును భార్యకు కల్పించే సీఆర్పీసీ సెక్షన్‌ 125 మతంతో సంబంధం లేకుండా వివాహితలందరికీ వర్తిస్తుందని.. ట్రిపుల్‌ తలాఖ్‌ ద్వారా చట్టవిరుద్ధంగా విడాకులు పొందిన ముస్లిం మహిళలు ఈ సెక్షన్‌ కింద భరణం కోరవచ్చని స్పష్టం చేసింది!! ‘‘భరణం.. వివాహితల హక్కు. దాతృత్వం కాదు’’ అని తేల్చిచెప్పింది. ఈ సెక్షన్‌ కింద భరణం కోరే హక్కు ముస్లిం మహిళలకు కూడా ఉందంటూ 1985లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా.. కొందరు సంప్రదాయవాదుల ఒత్తిళ్లకు లొంగిపోయి 1986లో రాజీవ్‌గాంధీ సర్కారు ఆ తీర్పునకు భిన్నంగా ముస్లిం మహిళల భరణానికి సంబంధించి ఒక చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ చట్టం ప్రకారం మాత్రమే ముస్లిం మహిళలు భరణం కోరాలనే వాదనను సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో తోసిపుచ్చింది. సీఆర్పీసీలోని లౌకికమైన, మతపరంగా తటస్థమైన సెక్షన్‌ 125ను ఈ కేసులో ఆ చట్టం ప్రభావితం చేయలేదని తేటతెల్లం చేసింది.

న్యూఢిల్లీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): భర్త నుంచి భరణం కోరే హక్కును భార్యకు ఇచ్చే సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 దేశంలోని వివాహితలు అందరికీ మతాతీతంగా వర్తిస్తుందని తేల్చిచెప్పింది. 2019నాటి ‘ముస్లిం విమెన్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆన్‌ మ్యారేజ్‌) యాక్ట్‌కు విరుద్ధంగా.. ముమ్మారు తలాఖ్‌ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇస్తే.. భార్య ఆ చట్టంతోపాటు, ఈ సెక్షన్‌ ద్వారా కూడా భరణం కోరవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ సమద్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరిపి ఈ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అబ్దుల్‌ సమద్‌ తన భార్యకు 2017లో ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం విడాకులు ఇచ్చారు. దీంతో ఆమె.. సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 కింద భర్తతో తనకు భరణం ఇప్పించాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు. పూర్వాపరాలను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు.. నెలకు రూ.20 వేలు భరణం కింద చెల్లించాలని సమద్‌ను ఆదేశించింది.


ఆ తీర్పును సమద్‌ తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేశారు. ముస్లిం పర్సనల్‌ చట్టం ప్రకారం.. తాను భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ విషయాన్ని ఫ్యామిలీ కోర్టు పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేయటానికి హైకోర్టు నిరాకరించింది. నెలకు చెల్లించాల్సిన భరణాన్ని మాత్రం రూ.10 వేలకు తగ్గించింది. బాధితురాలు పిటిషన్‌ వేసినప్పటి నుంచి భరణం చెల్లించాలని ఆదేశించింది. దీనిని సమద్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది వసీం ఖాద్రీ వాదనలను వినిపించారు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు ‘ముస్లిం మహిళల విడాకుల హక్కుల పరిరక్షణ చట్టం, 1986’ వర్తిస్తుందిగానీ, సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 వర్తించదని.. భరణం చెల్లించాల్సిన అవసరం లేదని వాదించారు. ముస్లిం మహిళలకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 కన్నా, 1986 నాటి చట్టమే అధిక ప్రయోజనం కలిగిస్తుందన్నారు. కాగా, ఈ కేసులో గౌరవ్‌ అగర్వాల్‌ అనే న్యాయవాదిని అమికస్‌ క్యూరీ(కోర్టు సహాయకుడిగా)గా న్యాయస్థానం నియమించింది.


వాదనలను విన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన రిజర్వు చేసింది. తాజాగా బుధవారం జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసి్‌హతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ‘ముస్లిం మహిళల విడాకుల హక్కుల పరిరక్షణ చట్టం, 1986’, సీఆర్‌పీసీ 125 సెక్షన్‌.. ఈ రెండింటిలో 125 సెక్షనే ఈ కేసులో వర్తిస్తుందని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ‘‘మతాల సరిహద్దులకు అతీతంగా వివాహిత మహిళలకు ఆర్థిక భద్రత కల్పించే, లింగ సమానత్వాన్ని బలోపేతం చేసే హక్కు భరణం’’ అని స్పష్టం చేసింది. అయితే.. ముస్లిం మహిళలు భరణం కోసం 1986లో రాజీవ్‌గాంధీ సర్కారు తెచ్చిన ‘ముస్లిం మహిళల విడాకుల హక్కుల పరిరక్షణ చట్టం, 1986’ను, సీఆర్‌పీసీ 125 సెక్షన్‌ను.. రెండింటినీ ఉపయోగించుకోవచ్చని, ఇవి పరస్పర ఆధారితాలేగానీ పోటీ కావని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సమద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. న్యాయమూర్తులిద్దరూ వేర్వేరుగా తీర్పులు వెలువరించినప్పటికీ ఒకే విధమైన తీర్పు ఇచ్చారు.


స్వాగతించిన బీజేపీ..

భరణానికి సంబంధించి సీఆర్పీసీ సెక్షన్‌ 125 మతాలకు అతీతంగా వివాహిత మహిళలందరికీ వర్తిస్తుందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతించింది. 1985లో ఇదే రీతిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమిస్తూ 1986లో రాజీవ్‌గాంధీ సర్కారు చట్టాన్ని తెచ్చిందని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేదీ దుయ్యబట్టారు. షరియాకు, ఇస్లామిక్‌ చట్టాలకు ప్రాధాన్యం ఇస్తూ చేసిన ఆ చట్టం రాజ్యాంగానికే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. అప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. అప్పట్లో రాజీవ్‌గాంధీ సర్కారు రాజ్యాంగం కంటే షరియాకే ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్‌ హయాంలో అణచివేతకు గురైన రాజ్యాంగ ప్రతిష్ఠను సుప్రీం తాజా తీర్పు పునరుద్ధరించింది. రాజ్యాంగానికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పుల్లో ఒకదానికి ముగింపు పలికింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. ఈ తీర్పుతో ఉమ్మడి పౌరస్మృతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తెస్తామని బీజేపీ 2024 ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో ప్రకటించింది.


కుటుంబం కోసం భార్యల త్యాగం

జస్టిస్‌ బీవీ నాగరత్న తన తీర్పులో.. భార్య ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత భర్తదేనని హితవు పలికారు. ‘‘సొంతంగా ఆదాయం అంటూ లేని భార్యకు భర్త తన ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచాలి. కుటుంబ అవసరాలతోపాటు ఆమె వ్యక్తిగత అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలి. ఈ చైతన్యాన్ని భర్త కలిగి ఉండాలి. ఈ విధంగా ఆర్థికంగా సమృద్ధిపరిచినప్పుడే కుటుంబంలో భార్య స్థానం ఎవరి మీదా ఆధారపడే పరిస్థితి లేకుండా సుస్థిరంగా ఉంటుంది. ఈ విధమైన చైతన్యాన్ని కలిగి ఉండి.. తన ఏటీఎం కార్డును ఇవ్వటం ద్వారా, బ్యాంకులో ఖాతాను ఇద్దరి పేరు మీద తీసుకోవటం ద్వారా భార్యను ఆర్థికంగా ఆత్మవిశ్వాసంతో ఉంచేలా వ్యవహరిస్తున్న భర్తలను అభినందించాలి’’ అని పేర్కొన్నారు. ఆర్థికంగా భర్త మీదే ఆధారపడే భార్యకు ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా చూడటానికే భరణం అని స్పష్టం చేశారు. విడాకులు తీసుకున్న వారేగాక వివాహిత మహిళలందరికీ ఈ అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 04:48 AM

Advertising
Advertising
<