ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : విస్తరిస్తున్న ఎంపాక్స్‌

ABN, Publish Date - Aug 18 , 2024 | 03:36 AM

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎంపాక్స్‌(కోతుల నుంచి వ్యాపించే అరుదైన వ్యాధి) ఇప్పుడు పాకిస్థాన్‌కూ వ్యాపించింది. ముగ్గురు వ్యక్తుల్లో ఎంపాక్స్‌ లక్షణాలు ఉన్నట్టు పాక్‌ వైద్యులు నిర్ధారించారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచారు.

  • ఆఫ్రికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి.. డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన

  • కాంగోలో ఈ ఏడాది 350 మంది మృతి.. వైర్‌సకు మశూచి టీకాతో ఉపశమనం

జెనీవా/న్యూఢిల్లీ, ఆగస్టు17: ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎంపాక్స్‌(కోతుల నుంచి వ్యాపించే అరుదైన వ్యాధి) ఇప్పుడు పాకిస్థాన్‌కూ వ్యాపించింది. ముగ్గురు వ్యక్తుల్లో ఎంపాక్స్‌ లక్షణాలు ఉన్నట్టు పాక్‌ వైద్యులు నిర్ధారించారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచారు.

కొన్నాళ్లుగా ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్‌ విస్తరించింది. దీంతో గతంలోనే ఓసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఇప్పుడు మరోసారి హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించడం గమనార్హం. ఎంపాక్స్‌ సోకిన వారితో కలివిడిగా ఉండే వ్యక్తులకు ఇది వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఎంపాక్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ సమాజం సహకరించాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ఘెబ్రెయాసస్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంగో సహా చుట్టుపక్క దేశాల్లో ఎంపాక్స్‌ తీవ్రంగా విస్తరించినట్టు తెలిపారు.


  • ఆఫ్రికా దేశాలకు వెలుపల తొలి కేసు స్వీడన్‌లో నమోదైనట్టు ఆదేశం ప్రకటించింది. వైరస్‌ సోకిన వ్యక్తి కొన్ని రోజులు ఆఫ్రికాలో పర్యటించి వచ్చినట్టు స్వీడన్‌ ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ విగ్‌జెల్‌ ప్రకటించారు.

  • పాకిస్థాన్‌లో ఒకే రోజు 3ఎంపాక్స్‌ కేసులు నమోదైనట్టు ఖైబర్‌ ఫక్తున్వా ప్రావిన్స్‌ ఆరోగ్య విభాగం ప్రకటించింది. యూఏఈ నుంచి వచ్చిన వారు అనారోగ్యంతో ఇబ్బంది పడగా పరీక్షిస్తే లక్షణాలు కనిపించినట్టు తెలిపింది.

  • తమ దేశంలోకి వచ్చే విదేశీ పౌరులు, వస్తు సామాగ్రిని వచ్చే 6మాసాల వరకు నిశితంగా పరీక్షించాలని నిర్ణయించుకున్నట్టు చైనా తెలిపింది. ఎంపాక్స్‌ విస్తరించిన దేశాల నుంచి వచ్చే వారిని స్ర్కీనింగ్‌ చేయనున్నట్టు పేర్కొంది.

  • గత ఏడాదే ఎంపాక్స్‌పై చైనా అప్రమత్తమైంది. దీన్ని కేటగిరీ-బీ అంటువ్యాధిగా పేర్కొంటూ కొన్ని ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం అవసరమైతే పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని పేర్కొంది.

  • ఆఫ్రికాలో ఈ ఏడాది తొలి 6 మాసాల్లోనే 17 వేల కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇప్పటి వరకు 500మంది మృతి చెందినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే మరోసారి హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించినట్టు పేర్కొంది.

  • ఎంపాక్స్‌ తొలినాళ్లలో ఆఫ్రికాకే పరిమితమైనా 2022 ద్వితీయార్థం నుంచి నైజీరియాకు, అక్కడ నుంచి ఇతర దేశాలకు విస్తరించింది.


  • ఆఫ్రికా ఖండంలోని దాదాపు అన్ని దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఎంపాక్స్‌ లక్షణాలు, తీవ్రతను బట్టి 2 కేటగిరీలుగా విభజించారు. ఆఫ్రికాలో తీవ్రమైన లక్షణాలున్న కేసులను కేటగిరీ-1గా పేర్కొన్నారు. ఇవి మరణాలు పెరగడానికి దారితీస్తున్నట్టు తెలిపింది.

    స్వల్పలక్షణాలు, విస్తరణ వేగం ఉన్న కేటగిరీ-2 ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్నట్టు పేర్కొంది. ఎంపాక్స్‌గా పేర్కొనే అంటువ్యాధి కోతుల నుంచి ఇతర జీవులకు, మనుషులకు వ్యాపిస్తుంది. ఇది మశూచి తరహా అంటువ్యాధి.

    గత ఏడాది జనవరి నుంచి కాంగోలో 27 వేల కేసులు నమోదు కాగా 11వందల మంది మృతి చెందిన రాయిటర్స్‌ వెల్లడించింది. ఈ ఏడాది తొలి 6మాసాల్లో 8వేల కేసులు నమోదు కాగా 350 మంది మృతి చెందారని పేర్కొంది. చిన్నారుల్లో మంకీపాక్స్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కోతుల నుంచి వ్యాపిస్తున్న వైరస్‌ కావడంతో తొలినాళ్లలో దీనికి ‘మంకీ పాక్స్‌’గా పేరు పెట్టారు. 2022 నవంబరులో మంకీపాక్స్‌ పేరును ‘ఎంపాక్స్‌’గా నిర్ధారించారు.


  • లక్షణాలు ఇవీ..

ఎంపాక్స్‌ వైరస్‌ సోకిన వారు జ్వరం, చలి, శారీరక, కండరాల నొప్పులతో ఇబ్బంది పడతారు. అరచేతులు, పాదాలు, ముఖం, జననేంద్రియాలు, నోటిపై కురుపుల వంటి దద్దుర్లు ఏర్పడతాయి. కొన్ని తీవ్ర కేసుల్లో మెదడు ఉబ్బడం, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, రక్త ప్రసరణలో ఇన్‌పెక్షన్‌, అంధత్వం వంటివీ కనిపిస్తాయి. వైరస్‌ సోకిన వారు దాదాపు 2 నుంచి 4 వారాల్లో కోలుకునే అవకాశం ఉంది. ఎంపాక్స్‌ నుంచి కోలుకునేందుకు ఎంవీఏ-బీఎన్‌ టీకాను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మశూచి కోసం తయారు చేసిందే అయినా ఎంపాక్స్‌ మశూచి కుటుంబానికి చెందిన వైరస్‌ కావడంతో ఈ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

  • ఎలా విస్తరిస్తుంది?

వైరస్‌ సోకిన జంతువుల, మనుషులను స్పృశించినా, శృంగారం చేసినా, వైరస్‌ సోకిన జంతువు మాంసాన్ని భుజించినా ఎంపాక్స్‌ సోకుతుంది. అదేవిధంగా వైరస్‌ సోకిన జంతువులు కరిచినా, గోటి గీతలు పడినా వైరస్‌ అంటుకుంటుంది. అమెరికా సహా పలు దేశాల్లోని కుక్కల్లోనూ ఈ వైరస్‌ కనిపించినట్టు నివేదికలు చెబుతున్నాయి.

Updated Date - Aug 18 , 2024 | 03:36 AM

Advertising
Advertising
<