PM Modi: ఇళ్లలోకి చొరబడి మట్టుబెడుతున్నాం
ABN, Publish Date - Apr 12 , 2024 | 08:12 AM
కేంద్రంలో శక్తిమంతమైన బీజేపీ ప్రభుత్వం ఉందని.. అందుకే మన సైనిక బలగాలు ఉగ్రవాదులను వారి నేలపైనే మట్టుబెడుతున్నాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. వారి ఇళ్లలోకి చొచ్చుకెళ్లి మరీ చంపుతున్నాయని చెప్పారు.
● పటిష్ఠ ప్రభుత్వంతోనే ఇది సాధ్యం: మోదీ
● ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో ప్రచారం
జైపూర్/రిషీకేశ్, ఏప్రిల్ 11: కేంద్రంలో శక్తిమంతమైన బీజేపీ ప్రభుత్వం ఉందని.. అందుకే మన సైనిక బలగాలు ఉగ్రవాదులను వారి నేలపైనే మట్టుబెడుతున్నాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. వారి ఇళ్లలోకి చొచ్చుకెళ్లి మరీ చంపుతున్నాయని చెప్పారు. దేశాన్ని లూటీ చేయకుండా అవినీతిపరులను అడ్డుకున్నానని.. దీంతో తనపై వారి కోపం పతాకస్థాయికి చేరిందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్, రాజస్థాన్‌లోని కరౌలీల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. గతంలో అస్థిర, బలహీన ప్రభుత్వాలు ఉన్నప్పుడు శత్రువులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేశారని.. ఇప్పుడు జాతీయ భద్రతకు కట్టుబడిన, యుద్ధ క్షేత్రాల్లోనూ దృఢంగా ఉన్న బలమైన సర్కారు కేంద్రంలో ఉందని, మన బలగాలు శత్రువుల ఇళ్లలోకి చొరబడి చంపేస్తున్నాయని చెప్పారు.
అవినీతిపరులు ఏ పరిస్థితుల్లోనూ జైలుకే వెళ్తారని.. ఇది తన గ్యారెంటీ అని పేర్కొన్నారు. తననెంత బెదిరించినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ‘దేశవ్యాప్తంగా అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అందుకే నాకు వ్యతిరేకంగా విపక్షాలు ఇండీ కూటమిని ఏర్పాటుచేశాయి. 2024 ఎన్నికలు ఎవరు ఎంపీ అవుతారు.. ఎవరు కారన్నది తేల్చడానికి కాదు.. వికసిత్ భారత్ సంకల్పానికి కొత్త శక్తి ఇచ్చేందుకే ఈ ఎన్నికలు. గరీబీ హటావో అని కాంగ్రెస్ దశాబ్దాలపాటు నినాదం చేసింది. కానీ 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడానికి నేను కృషిచేశాను’ అని అన్నారు. తన జీవితంతో ప్రతి క్షణం దేశానికే అంకితమని చెప్పారు. విశ్రాంతి తీసుకోవడానికో, వినోదానికి మోదీ పుట్టలేదు. మోదీకి దేశ ప్రజలకు సంబంధించిన పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. వాటి సాధనకు కష్టపడుతున్నాడు’ అని వ్యాఖ్యానించారు.
రాముడి ఉనికినే ప్రశ్నించింది..
భారతదేశంలోని ప్రజల్లో అత్యధికులు బలమైన నాయకుడిని తమ నేతగా కోరుకుంటున్నారని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పని తీరుపె సంతృప్తికరంగా ఉన్నారని ఇంటర్నేషనల్ ఐడీఈఏ( ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్‌టెన్స్) అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని 59% మంది కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తికరంగా ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశంలోని ఇతర సర్వేలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెల్లడించాయని పేర్కొంది.
Updated Date - Apr 12 , 2024 | 08:18 AM