PM Modi : అమ్మ కోసం ఓ మొక్క!
ABN, Publish Date - Jul 01 , 2024 | 04:46 AM
తల్లిని గౌరవించేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమం ‘అమ్మ పేరుతో ఓ మొక్క (ఏక్ పేడ్ మా కే నామ్)’ గురించి ‘మన్ కీ బాత్’లో ప్రకటించారు.
ప్రధాని నూతన కార్యక్రమం ‘ఏక్ పేడ్ మా కే నామ్’
మూడోసారి గద్దెనెక్కాక తొలి
‘మన్ కీ బాత్’లో మోదీ ప్రకటన
న్యూఢిల్లీ, జూన్ 30: తల్లిని గౌరవించేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమం ‘అమ్మ పేరుతో ఓ మొక్క (ఏక్ పేడ్ మా కే నామ్)’ గురించి ‘మన్ కీ బాత్’లో ప్రకటించారు. మూడోసారి ప్రధాని అయ్యాక.. ఆకాశవాణిలో ఆదివారం ‘మన్ కీ బాత్’ తొలి సంచికలో ఆయన ప్రసంగించారు.
తాను కూడా తన తల్లి పేరిట ఓ మొక్క నాటానని ప్రధాని తెలిపారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువలపై తమకున్న అచంచల విశ్వాసాన్ని ఓటుద్వారా వ్యక్తం చేసిన దేశ ప్రజలను ఆయన అభినందించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 65 కోట్ల మందికిపైగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని గుర్తుచేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్‌ను, ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఎన్డీయేని తిరిగి ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ.. భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తంగా పరిఢవిల్లుతోందని చెప్పారు. మన కవులు, భాషలకు పలు దేశాల్లో ప్రాధాన్యం లభిస్తోందన్నారు. భారతీయ భాషలతో పాటు ఆచార సంప్రదాయాలను కూడా వివిధ దేశాల్లో పాటిస్తున్నారని తెలిపారు.
‘కువైట్ ప్రభుత్వం అక్కడి నేషనల్ రేడియోలో ప్రతీ ఆదివారం హిందీలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోందన్నారు. తుర్కిమెనిస్థాన్‌లో ఇటీవల వారి జాతీయ కవి (మగ్తిమ్‌గులీ పైరగీ) 300వ జయంతి జరిగింది. ఆ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన 24 మంది కవుల విగ్రహాలను ఆవిష్కరించారు. వారిలో మన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కూడా ఉంది. జూన్ 21న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సౌదీ అరేబియాలో అల్ హనౌఫ్ సాద్ అనే మహిళ ప్రధాన యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆ దేశంలో ఓ మహిళ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఇదే ప్రథమం’ అని వివరించారు. గిరిజన పోరాట యోధులు వీర్ సిద్ధూ, కాన్హూలకు ప్రధాని ఘనంగా నివాళులు అర్పించారు. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే 1855లో బ్రిటిష్ పాలకులపై సంతాల్ తిరుగుబాటుకు వీరు సారథ్యం వహించారు.
వీరి స్మారకార్థం గిరిజనులు జూన్ 30ని ‘హూల్ దివస్’గా జరుపుతారు. ఆకాశవాణిలో సంస్కృత వార్తల బులెటిన్ 50 ఏళ్లు పూర్తిచేసుకోవడంపై ప్రధాని హర్షం వ్యక్తంచేశారు. వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో పాలుపంచుకోనున్న భారతీయ అథ్లెట్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
నీట్ లీక్ ప్రస్తావన ఏది?
మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రజల సమస్యలను ప్రస్తావించలేదని కాంగ్రెస్ ఆక్షేపించింది. నీట్ పేపర్ లీకులు, రైలు ప్రమాదం, వంతెనలు, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పైకప్పు కూలడం వంటివాటి ఊస్తెతలేదని ఏఐసీసీ మీడియా-పబ్లిసిటీ అధిపతి పవన్ ఖేరా ధ్వజమెత్తారు. మోదీ మూడోసారి గెలిచినప్పటికీ స్వశక్తితో ప్రధాని కాలేదన్నారు.
Updated Date - Jul 01 , 2024 | 04:46 AM