ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi : రాష్ట్రాలను ఏటీఎం చేసుకున్నారు

ABN, Publish Date - Nov 10 , 2024 | 04:53 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు.

  • వనరులను దోపిడీ చేస్తున్నారు.. మహారాష్ట్రను ఏటీఎం కానివ్వం

  • కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని

  • మహారాష్ట్రలో మోదీ సుడిగాలి పర్యటన

నాగ్‌పూర్‌/నాందేడ్‌, నవంబరు9: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. నాగ్‌పూర్‌ సమీపంలోని అకోలా, నాందేడ్‌ సహా పలు నియోజకవర్గాల్లో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ నేతలు, ముఖ్యంగా రాజకుటుంబం ఏటీఎంలుగా భావిస్తోందని, రాష్ట్రాల ఆర్థిక మూలాలను దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. తాము అంబేడ్కర్‌ వారసులమని చెప్పుకొనే కాంగ్రెస్‌.. రాజ్యాంగ నిర్మాత కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. అకోలా నియోజకవర్గంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఎక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రం ఆ రాజ కుటుంబానికి ఏటీఎం. కానీ, మహారాష్ట్రను మాత్రం వారికి ఏటీఎం కానివ్వబోం’’ అన్నారు. ‘‘అంబేడ్కర్‌ పంచతీర్థాలను మీరెప్పుడైనా సందర్శించి ఉంటే నిరూపించండి’’ అని కాంగ్రెస్‌ నేతలకు ప్రధాని సవాల్‌ విసిరారు. అంబేడ్కర్‌ జన్మస్థలం మౌ, లండన్‌లోని ఆయన నివాసం, నాగ్‌పూర్‌లోని దీక్షా భూమి, ఢిల్లీలోని అంబేడ్కర్‌ మహాపరినిర్వాణ స్థల్‌, ముంబైలోని చైత్యభూమిలను అంబేడ్కర్‌ పంచతీర్థాలుగా అభివర్ణించారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణా ప్రజలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్‌ పార్టీ కుట్రను భగ్నం చేశారని, మహారాష్ట్ర ప్రజలు కూడా ఐక్యంగా ఉండి కాంగ్రెస్‌ కుట్రలను ఛేదించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెస్‌ కులాల మధ్య చిచ్చుపెడుతోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ కూటమి అవినీతి, కుంభకోణాలకు పరాకాష్ఠ. ఆ కూటమి నేతలు లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు’’ అని నిప్పులుచెరిగారు. నాందేడ్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, దళితులు, ఆదివాసీలు ఐక్యంగా ఉండడంతో కాంగ్రెస్‌ పునాదులు కదిలిపోతున్నాయన్నారు. ‘‘కాంగ్రెస్‌నేతలు ఇటీవల ‘రెడ్‌ బుక్‌’ చూపుతున్నారు. దీనికి ‘భారత రాజ్యాంగం’ అని పేరు పెట్టారు. కానీ, లోపలన్నీ ఖాళీ పేజీలే. ఆ పార్టీ నేతల దురదృష్ట, దౌర్భాగ్యకర రాజకీయాలతో దేశం దిగ్ర్భాంతికి గురవుతోంది’’ అని మోదీ అన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 04:53 AM