PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కీలక స్పీచ్.. వచ్చే ఐదేళ్లలో..
ABN, Publish Date - Apr 14 , 2024 | 11:23 AM
BJP Manifesto 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto) విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఐదేళ్లు కూడా ఉచిత రేషన్(Free Ration) అందజేస్తామని ప్రకటించారు. అంతకంటే ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం(Free Treatment) అందిస్తామని ప్రకటించారు.
BJP Manifesto 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto) విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఐదేళ్లు కూడా ఉచిత రేషన్(Free Ration) అందజేస్తామని ప్రకటించారు. అంతకంటే ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం(Free Treatment) అందిస్తామని ప్రకటించారు. ఆదివారం ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. కీలక ప్రకటనలు చేశారు. వృద్ధులనూ ఆయుష్మాన్ భారత్‌లో చేరుస్తామని.. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తమ హయాంలో పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని.. మరో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకానికి కోటి మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఇంట్లో తయారైన కరెంట్‌ను ప్రజలు అమ్ముకోవడానికి కూడా వీలుంటుందన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగం యధావిధిగా..
‘ముద్ర పథకం కింద కోట్లమందికి స్వయం ఉపాధి లభించింది. ముద్ర పథకం రుణ పరిమితిని రూ.20 లక్షలు చేస్తాం. చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తాం. దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరారు. మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలని ప్రోత్సహిస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తాం. వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగం పెంచుతాం. దేశాన్ని గ్లోబల్ న్యూట్రిషన్ హబ్‌గా మారుస్తాం. శ్రీఅన్న రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు ఉంటుంది. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తాం. దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మారుస్తాం. నానో యూరియా వినియోగం మరింత పెంచుతాం.’ అని ప్రధాని మోదీ అన్నారు.
‘బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతి రెండింటికీ ప్రాధాన్యం ఉంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్‌ను మారుస్తాం. ఏజెన్సీలో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తాం. సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతాం. దేశంలో అనేకచోట్ల శాటిలైట్ పట్టణాలు నిర్మిస్తున్నాం. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి ఉపాధి కల్పిస్తున్నాం. దేశంలో మూడు రకాల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్లు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గం పూర్తి కానుంది. ఉత్తర, దక్షిణ, తూర్పు వైపు కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తాం. ఈవీ మార్కెట్ దేశంలో శరవేగంగా దూసుకెళ్తోంది. బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటాం.’ అని ప్రధాని మోదీ చెప్పారు.
‘యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకువస్తాం. వన్ నేషన్, వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తాం. దేశాభివృద్ధికి అవినీతి ఆటంకంగా నిలిచింది. అవినీతిపై నిరంతరం యుద్ధం చేస్తామని గ్యారంటీ ఇస్తున్నా. అవినీతిపరులు ఎంతటివారైనా జైళ్లకు పంపిస్తాం. నాలుగు స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదులు వేశాం. యువశక్తి, నారీశక్తి, గరీబ్, కిసాన్‌ను దృష్టితోనే సంకల్ప్ పత్ర. యువత ఆకాంక్షలను మా సంకల్ప్ పత్ర ప్రతిబింబిస్తోంది. 140 కోట్ల మందికి మోదీ కీ గ్యారంటీ రూపంలో హామీ ఇస్తున్నాం.’ అని ప్రధాని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 14 , 2024 | 11:23 AM