Lok Sabha Elections 2024: బీజేపీపై కాంగ్రెస్ ఫేక్ ప్రచారం.. ప్రశాంత్ కిశోర్ స్ట్రాంగ్ కౌంటర్
ABN, Publish Date - May 23 , 2024 | 03:53 PM
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో పసిగట్టలేనంతగా వైరల్ అవుతున్నాయి. చివరికి.. ఈ ఫేక్ వార్తల ఛట్రంలో..
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో (Social Media) ఫేక్ ప్రచారాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో పసిగట్టలేనంతగా వైరల్ అవుతున్నాయి. చివరికి.. ఈ ఫేక్ వార్తల ఛట్రంలో రాజకీయ నాయకులు సైతం చిక్కుకుపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) కూడా ఇందుకు మినహాయింపు కాదు. బీజేపీ (BJP), ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లకు (Prashant Kishor) సంబంధించి ఓ వార్త నెట్టింట్లో సర్క్యులేట్ అవ్వగా.. అది నిజమేనేమోనని భావించి జైరాం రమేశ్ షేర్ చేశారు. ఇది చూసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ.. ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
జైరాం రమేశ్ షేర్ చేసిన నోట్ ఏంటి?
తన వాట్సాప్‌లో జైరాం రమేశ్ షేర్ చేసిన పోస్టు ఒక బీజేపీ లెటర్‌హెడ్‌లా డిజైన్ చేసి ఉంది. ప్రశాంత్ కిషోర్‌ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్లు.. అందులో పేర్కొనబడి ఉంది. అంతేకాదు.. నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఆ లెటర్‌పై సంతకం చేసినట్లు డిజైన్ చేయబడింది. కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్తున్న తరుణంలో.. ఈ ఫేక్ వార్త తెరమీదకు వచ్చింది. అయితే.. ఇది నిజమో, కాదో నిర్ధారించుకోకుండా జైరాం రమేశ్ ఈ లెటర్‌హెడ్‌ని వాట్సాప్‌లో షేర్ చేశారు. ఇది ప్రశాంత్ కిషోర్ పార్టీ దృష్టికి చేరడంతో.. దీని స్క్రీన్ షాట్ తీసి, కాంగ్రెస్‌కి గట్టిగా బదులిచ్చింది.
ప్రశాంత్ కిషోర్ పార్టీ ఇచ్చిన కౌంటర్
‘‘ఈ విడ్డూరం చూడండి. తామంతా అబద్ధపు ప్రచారాల బాధితులమని కాంగ్రెస్, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు తరచూ చెప్పుకుంటుంటారు. అలాంటి మీరే ఇప్పుడు ఫేక్ వార్తల్ని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కమ్యునికేషన్స్ అధినేత, సీనియర్ నేత జైరాం రమేశ్.. ఎలా నకిలీ పత్రాన్ని సర్క్యులేట్ చేస్తున్నారో మీరే చూడండి’’ అని ఎక్స్ వేదికగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు.. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులను సైతం ట్యాగ్ చేశారు. మరి.. దీనిపై కాంగ్రెస్ పార్టీ లేదా జైరాం రమేశ్ ఎలాంటి బదులిస్తారో వేచి చూడాల్సిందే.
ప్రశాంత్ కిషోర్ జోస్యం
2014 ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత మూడు నాలుగు నెలల నుంచి ‘370 సీట్లు’ లేదా ‘400 పార్’ చుట్టే రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోందని అన్నాడు. ఇది బీజేపీ వ్యూహం లేదా ప్రతిపక్షాల బలహీనతో తెలీదు కానీ.. బీజేపీ తన లక్ష్యాన్ని 272 నుంచి 370కి మార్చిందని, ఇది ఆ పార్టీకి ఎంతో ప్రయోజనకరంగా మారిందని పేర్కొన్నాడు. అందుకే.. మోదీ ఓడిపోతాడని ఎవరూ చెప్పడం లేదని, వాళ్లకు 370 సీట్లు రాకపోవచ్చని మాత్రమే ప్రతిపక్షాల నేతలు అంటున్నారని చెప్పుకొచ్చాడు.
Read Latest National News and Telugu News
Updated Date - May 23 , 2024 | 03:53 PM