PM Modi : ద్వేషిస్తున్నా.. మౌనంగానే ఉన్నా!
ABN, Publish Date - Sep 17 , 2024 | 02:40 AM
మనసునిండా ద్వేషం నింపుకొన్న కొందరు భారత్, గుజరాత్ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు.
ఈ 100 రోజుల్లో విపక్షాలు నన్ను హేళన చేశాయి
పటేల్ గడ్డపై పుట్టిన బిడ్డగా అన్నీ భరించా: మోదీ
దేశంలో తొలి వందే మెట్రో రైలు ప్రారంభం
మోదీ స్ఫురించేలా ‘నమో భారత్’గా పేరు మార్పు
ప్రారంభానికి కొన్ని గంటల ముందు మార్చిన రైల్వే
నాగపూర్-సికింద్రాబాద్, దుర్గ్-విశాఖ రూట్లలో 2 వందే భారత్ సహా 5 రైళ్లు ప్రారంభం
గాంధీనగర్, అహ్మదాబాద్, సెప్టెంబరు 16: మనసునిండా ద్వేషం నింపుకొన్న కొందరు భారత్, గుజరాత్ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు దేశాన్ని చీల్చే ఎజెండాతో భారత సమగ్రత, ఐక్యతను లక్ష్యంగా చేసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ 370 ఆర్టికల్‌ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆ రాష్ట్రంపై రెండు రాజ్యాంగాలు, రెండు చట్టాలు రుద్దాలని అనుకుంటున్నారని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సోమవారం దేశంలో మొట్టమొదటిసారిగా ‘వందే మెట్రో రైలు’ ను మోదీ ప్రారంభించారు.
అందుకు కొన్ని గంటల ముందు ఈ రైలు పేరును ‘నమో భారత్ ర్యాపిడ్ రైలు’గా రైల్వేశాఖ అధికారులు మార్చారు. ఈ రైల్‌తో పాటు ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సహా రూ.8వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో దుర్గ్-విశాఖపట్నం, నాగపూర్-సికింద్రాబాద్ వందేభారత్ రైళ్లు ఉన్నాయి. అనంతరం మెట్రో రైల్లో మోదీ ప్రయాణించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో.. ఆ తర్వాత గాంధీనగర్‌లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులోనూ మోదీ ప్రసంగించారు. మూడోసారి ప్రధాని అయ్యాక తనను రకరకాల మాటలతో విపక్షాలు అవమానించాయని.. ద్వేషాన్ని వెళ్లగక్కాయని, ఎగతాళి చేశాయని, అయినా సర్దార్ పటేల్ గడ్డ మీద జన్మించిన బిడ్డగా ఆ అవమానాలన్నీ తాను భరించి మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు.
మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ వందరోజుల్లో అభివృద్ధి పనుల పరంగా నిర్దేశించుకున్న ఎజెండాను వేగంగా పూర్తిచేశానని చెప్పారు. తన జీవితం ప్రజల కోసమేనన్నారు. ‘‘నేను కష్టపడితే ఆ కష్టం మీ కోసం.. నేను త్యాగం చేస్తే ఆ త్యాగమూ మీ కోసమే’’ అని వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వచ్చే వెయ్యేళ్ల కోసం అభివృద్ధి పరంగా భారత్ పునాదులు వేస్తోందని.. ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడటంతో పాటు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమూ మనకు ప్రధానం అని అన్నారు.
21వ శతాబ్దం మీద చరిత్ర లిఖిస్తే గనక అందులో సౌరశక్తిలో భారత విప్లవం మీద ప్రత్యేక అధ్యాయం ఉంటుందన్నారు. మూడోసారి అఽధికారంలోకి వచ్చిన ఈ వంద రోజుల్లో తమ సర్కారు ప్రతి రంగంలో పురోగతికి ప్రయత్నించిందన్నారు. అయోధ్యతో పాటు మరో 16 నగరాలను ‘మోడల్ సోలార్ సిటీస్’గా అభివృద్ధి చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని వవోల్ ప్రాంతంలో ‘ఉచిత సౌర విద్యుత్తు’ లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు.
‘నమో..’ భారత్
నరేంద్ర మోదీ! ఈ పేరు పొడి అక్షరాల్లో రాస్తే నమో! మోదీ పేరును స్ఫూరించే విధంగా ఓ రైలుకు పేరు పెట్టేసింది రైల్వేశాఖ. వాస్తవానికి గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ మధ్య ప్రారంభించిన రైలుకు తొలుత అనుకున్న పేరు ‘వందే మెట్రో’! సోమవారం ఈ రైలును ప్రారంభించే కొన్ని గంటల ముందు రైల్వేశాఖ పేరు మార్చేసింది. ‘నమో భారత్ ర్యాపిడ్ రైలు’ అని పేరు పెట్టింది. అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపడంతో భుజ్ రైల్వే స్టేషన్ నుంచి సోమవారం 4:15 గంటలకు అహ్మదాబాద్ దిశగా ఈ రైలు పరుగుతీసింది. ‘నమో భారత్ ర్యాపిడ్ రైలు’ భుజ్-అహ్మదాబాద్ మధ్య తొమ్మిది స్టేషన్లను కవర్ చేస్తూ 5:45 గంటల్లో 359 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 12 బోగీల్లో 1,150 సీట్లుంటాయి.
Updated Date - Sep 17 , 2024 | 02:47 AM