Priyanka Gandhi: మోదీ ఒక్క పథకమైనా తీసుకొచ్చారా?
ABN, Publish Date - May 09 , 2024 | 04:07 AM
ప్రధాని మోదీ తన పదేళ్ల హయాంలో ఒక్క పథకాన్నైనా ప్రారంభించారా, ఒక్క సంస్థనైనా నెలకొల్పారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.
పదేళ్లలో ఒక్క సంస్థనైనా ప్రారంభించారా?
బీజేపీ అంచనాలు తలకిందులవుతున్నాయి
పీటీఐ ఇంటర్వ్యూలో ప్రియాంకాగాంధీ
రాయ్‌బరేలీ, మే 8: ప్రధాని మోదీ తన పదేళ్ల హయాంలో ఒక్క పథకాన్నైనా ప్రారంభించారా, ఒక్క సంస్థనైనా నెలకొల్పారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభించిన వాటిని పేరు మార్చి అమలు పరిచినవి కాకుండా, మోదీ స్వయంగా మొదలుపెట్టిన ఒక్క పథకమైనా ఉంటే అదేమిటో చెప్పాలని ప్రధానికి సవాల్ విసిరారు. మూడు దశల ఎన్నికల తర్వాత దేశంలో మార్పు పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. బుధవారం ఆమె పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తొలగించి వాటిని ముస్లింలకు ఇస్తుందని, అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాస్తుందని మోదీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. వాస్తవాలను పట్టించుకోకుండా, ఊహాలోకంలో విహరిస్తూ ఆయన మాట్లాడుతున్నట్లు ఉందన్నారు. ‘గత పది రోజులుగా గమనిస్తున్నా.. ఆయన ప్రసంగాలు ఊహాజనిత అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. దేశ ప్రజలంటే అతడికి గౌరవం లేదు.
అందుకనే వాస్తవాలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మేం ప్రజల్నించి బర్రెలను గుంజుకుంటామని, వారి ఇళ్లలో ఆభరణాలు, సంపదను గుర్తించటానికి ఎక్స్‌రే మిషన్లను పెడతామని ఏదేదో చెబుతున్నారు. ప్రధానమంత్రి అంతటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి కాకుండా మరెవరైనా ఇటువంటి మాటాలు మాట్లాడితే నవ్వుకుంటాం. కానీ, స్వయంగా ప్రధానే ఈ అబద్ధాలను నిజాలుగా ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని మారుస్తామని వారే చెప్పారు
బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని మీరట్ బీజేపీ అభ్యర్థి, కొందరు కేంద్రమంత్రులు బహిరంగంగా చెప్పారని ప్రియాంక గుర్తు చేశారు. ‘రాజ్యాంగం వల్లనే దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. రిజర్వేషన్లు ఉన్నాయి. ఓటు హక్కు ఉంది. అటువంటి రాజ్యాంగాన్ని మార్చి ప్రజల హక్కులను బీజేపీ బలహీనపరచాలని చూస్తే ఊరుకోబోము. బీజేపీని ఆ పని చేయనివ్వం’ అని ప్రియాంక స్పష్టం చేశారు. దేశంలో మార్పు పవనాలు కనిపిస్తున్నాయని.. అందుకనే 400 సీట్లకుపైగా అనే బీజేపీ అంచనాలు క్రమేణా తగ్గుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రజానుకూల గ్యారెంటీలతో సాధారణ ప్రజలు ఎలా లబ్ధి పొందుతున్నారో చెప్పటానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే ఉదాహరణ అని ప్రియాంక పేర్కొన్నారు.
బ్రిటిష్ రాజ్‌ను తలపిస్తున్న మోదీ పాలన
కేంద్రంలో బీజేపీ పాలన ‘బ్రిటిష్ రాజ్’ను తలపిస్తోందని ప్రియాంక గాంధీ అన్నారు. మోదీ పాలనతో ప్రభుత్వ విధానాలను కేవలం కోటీశ్వరులను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నారని, పేదలను, రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బుధవారం ప్రియాంక రాయ్‌బరేలీలో తన సోదరుడు రాహుల్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘ఐదేళ్లుగా అదానీ, అంబానీల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఎన్నికల ప్రచారంలో మాత్రం వారి పేర్లు తీయడం లేదు’’ అన్న మోదీ వ్యాఖ్యలపైనా ప్రియాంక స్పందించారు. ‘‘బడా పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై వారి రూ.16లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందే బీజేపీ’’ అంటూ ఎదురుదాడి చేశారు. బీజేపీ పరివారమంతా రాహుల్‌పై అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజీగా ఉందన్నారు.
Updated Date - May 09 , 2024 | 04:07 AM