Professor Sood: ఎలక్ట్రిక్ కార్ల విప్లవానికి రూ.1,200కోట్లు అవసరం..
ABN , Publish Date - Jul 19 , 2024 | 06:27 PM
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు కల్పించాలని ఆశిస్తున్నట్లు భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ తెలిపారు. వాయు కాలుష్యానికి భారతదేశం ప్రపంచ రాజధానిగా ఉందని, పెద్ద నగరాల్లో దీన్ని తగ్గించేందుకు ఈ-మొబిలిటీ చాలా మంచి మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆయన విడుదల చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు కల్పించాలని ఆశిస్తున్నట్లు భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ తెలిపారు. వాయు కాలుష్యానికి భారతదేశం ప్రపంచ రాజధానిగా ఉందని, పెద్ద నగరాల్లో దీన్ని తగ్గించేందుకు ఈ-మొబిలిటీ చాలా మంచి మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆయన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ డిలో రూ.1,200కోట్లు పెట్టుబడి పెడితే చాలని, దీని వల్ల వచ్చే ఐదేళ్లలో భారతదేశం ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో అగ్రగామిగా నిలుస్తుందని అజయ్ కుమార్ సూద్ చెప్పారు.
రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ వాహనాలు అంతరించిపోతాయని, ఎలక్ట్రిక్ వాహనాలకు పలు దేశాలు ప్రాధాన్యతమిస్తాయని ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ తెలిపారు. 2024మొదటి అర్ధభాగంలో మన దేశంలో దాదాపు 9లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మకాలు జరిగాయని, అయితే 2030నాటికి అది 30శాతానికి పెరగాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా "ఈ-మొబిలిటీ ఆర్ అండ్ డి రోడ్ మ్యాప్ ఫర్ ఇండియా" పేరుతో కొత్త నివేదిక ప్రారంభించినట్లు ప్రొఫెసర్ సూద్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు సరసమైన ధరలకు అందుబాటులోకి రావాలని, అందుకు బ్యాటరీ సాంకేతికతలో పెద్దఎత్తున పురోగతి అవసరం అని ఆయన చెప్పుకొచ్చారు. "సోడియం-అయాన్ బ్యాటరీలు, అల్యూమినియం-అయాన్ బ్యాటరీలపై పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అందుబాటు ధరలు, తేలికైన, సురక్షితమైన, ఎక్కువ కాలం మన్నికగా ఉండే బ్యాటరీలను తయారు చేయడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని ప్రొఫెసర్ చెప్పారు.
2030నాటికి ఉద్ఘారాల తీవ్రతలో 45శాతం తగ్గించాలని, 2070నాటికి సున్నా స్థాయికి చేరుకునేందుకు 2047నాటి కల్లా ఇంధనతో నడిచే వాహనాల వినియోగం ఆగిపోయేలా భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రొఫెసర్ సూద్ తెలిపారు. ఛార్జింగ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులు పెరుగుతాయని చెప్పారు. ఈ-మొబిలిటీ ఆర్ అండ్ డి రోడ్‌మ్యాప్ అనేది రాబోయే ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆ వాహనాల వినియోగంలో అగ్రగామిగా నిలిపేందుకు రూపొందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. దేశ జీడీపీకి ఆటోమొబైల్ రంగం అత్యధికంగా దోహదపడుతుందని, దాని వృద్ధిని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారతదేశం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.