Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది.. రాహుల్ గాంధీ ధ్వజం
ABN, Publish Date - Jul 29 , 2024 | 03:49 PM
లోక్‌సభ (Lok Sabha) బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తారాస్థాయిలో..
లోక్‌సభ (Lok Sabha) బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 బడ్జెట్ మధ్య తరగతి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ‘‘బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతికి ద్రోహం చేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించి, మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ఆధునిక చక్రవ్యూహాన్ని నిర్మించిందని.. అందులో రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి వారు, సమాజంలోని ఇతర వర్గాలు చిక్కుకొని ఉన్నారన్నారు. దీర్ఘకాలిక లాభాలపై పన్ను విధించడంతో.. మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్యాక్స్ టెర్రరిజం
రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాలను బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. కేంద్రమంత్రులతో పాటు నేతలు సైతం భయపెడుతున్నారని.. దేశవ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. ట్యాక్స్ టెర్రరిజంతో వ్యవస్థ ఆగమవుతోందని అన్నారు. పలు రకాల ట్యాక్సుల పేర్లతో ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. పద్మవ్యూహం కమలం ఆకారంలో ఉంటుందని.. బీజేపీ గుర్తుని ఉద్దేశిస్తూ రాహుల్ వ్యాఖ్యానించారు. పద్మవ్యూహం లాంటి కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉందని, అందుకే రైతులు భయపడుతున్నారని అన్నారు. మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఆరుగురు నియంత్రిస్తే.. ఇప్పుడు మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదాని లాంటి వారు కంట్రోల్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి
కేంద్రంలోని ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే ఉందంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఒకవైపు పేపర్ లీక్, మరోవైపు నిరుద్యోగ చక్రబంధంలో దేశం ఉందని.. ఇంటర్న్‌షిప్ వల్ల యువతకు ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. కాళ్లు విరగ్గొట్టి.. మీద బ్లాంకెట్ వేసినట్లు ఉందంటూ తూర్పారపట్టారు. అగ్నివీర్‌ల పెన్షన్‌కు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, మధ్యతరగతిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మద్దతు ధర ఇవ్వాలని రైతులు చాలాకాలం నుంచి అడుగుతున్నారని.. కానీ బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేదని నిప్పులు చెరిగారు.
బీజేపీ ఎంపీల అభ్యంతరం
ఇదిలావుండగా.. రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు స్పీకర్ ఓంబిర్లా (Speaker Om Birla) కలగజేసుకొని అభ్యంతరం తెలిపారు. ఒకరు ప్రసంగిస్తున్నప్పుడు ఇలా అడ్డుతగలడం సబబు కాదని.. సభా మర్యాదలను పాటించాలని కోరారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jul 29 , 2024 | 03:49 PM