హరియాణా యువత ఎందుకు ‘డంకీ’లవుతున్నారు?
ABN, Publish Date - Sep 25 , 2024 | 02:57 AM
దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేసి వారికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫలితంగా హరియాణా వంటి రాష్ట్రాల్లో యువత విదేశాల బాటపట్టి తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
బీజేపీకి రాహుల్‌గాంధీ ప్రశ్న
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేసి వారికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫలితంగా హరియాణా వంటి రాష్ట్రాల్లో యువత విదేశాల బాటపట్టి తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇటీవల ఆయన అమెరికా వెళ్లినప్పుడు హరియాణా నుంచి అమెరికా వలస వెళ్లినవారితో మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. హరియాణాలో ఉపాధి దొరకనందునే తాము అమెరికా వలస వచ్చి కష్టాలు పడుతున్నట్లు వారు రాహుల్‌గాంధీకి చెప్పారు. ‘‘హరియాణా యువత ఎందుకు డంకీలుగా మారుతున్నారు...? అని రాహుల్‌గాంధీ ‘ఎక్స్’లో పెట్టిన తన పోస్టులో ప్రశ్నించారు. అక్రమ వలసదారులపై షారుక్‌ఖాన్ నటించిన డంకీ సినిమాతో ఈ పదం జనం నానుడిలోకి వచ్చింది. ‘‘బీజేపీ తెచ్చిన నిరుద్యోగ సమస్యతో లక్షలాది మంది తమవారికి దూరంగా విదేశాల్లో కష్టాలు పడుతున్నారు’’ అని ఆరోపించారు. తాను తిరిగి స్వదేశానికి వచ్చాక హరియాణాలో వారి కుటుంబాలను కలిసినప్పుడు వారి కళ్లలో ఎంతో వేదన కనిపించిందన్నారు. పదేళ్లలో దేశ యువతకు బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలోని యువత విదేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చేస్తామని, ఇది తమ నిర్ణయమని స్పష్టం చేశారు.
Updated Date - Sep 25 , 2024 | 02:57 AM