CM Revanth Reddy : రక్షణ భూములివ్వండి!
ABN, Publish Date - Jun 25 , 2024 | 05:06 AM
హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకుగాను రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక వసతులకు అవసరం
మా 2,462 ఎకరాలను ఆర్‌సీఐ వాడుకుంటోంది
బదులుగా 2450 ఎకరాల భూములను ఇవ్వండి
వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతి పునరుద్ధరించండి
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి
కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌కు వినతి
నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ భేటీ
పీసీసీ అధ్యక్షుడు, నామినేటెడ్ పదవుల భర్తీ,
మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం
న్యూఢిల్లీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకుగాను రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రావిర్యాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటున్నందున రక్షణశాఖ భూములు 2,450 ఎకరాలను తమకు బదలాయించాలని కోరారు. దీంతోపాటు వరంగల్ సైనిక్ స్కూల్‌కు అనుమతులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాజ్‌నాథ్‌తో 17 అశోకా రోడ్‌లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని కోరారు. వరంగల్‌కు సైనిక్ స్కూల్‌ను గతంలోనే కేంద్రం మంజూరు చేసినా.. అప్పటి కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం వహించందని, స్కూల్ నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ అనుమతుల గడువు ముగిసినందున వాటిని పునరుద్ధరించాలని, లేదంటే తాజాగా మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం వెంట కాంగ్రెస్ ఎంపీలు కడియం కావ్య, గడ్డం వంశీ, మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అనంతరం ఖట్టర్‌ను ఆయన నివాసంలో రేవంత్ కలిశారు. తమ ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న 25 లక్షల ఇళ్లలో 15 లక్షలు ఇళ్లు పట్టణాభివృద్థి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్థిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) పద్ధతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి ఆవాస యోజన (పట్టణ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున 2024-25 సంవత్సరానికి ఈ పథకం కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని కోరారు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై(యు) మార్గదర్శకాల ప్రకారం నిర్మించనున్నట్లు తెలిపారు.
దీని కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి రూ.2,390.58 కోట్లు గ్రాంటు కింద ప్రకటించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అయితే ఇందులో ఇప్పటివరకు కేవలం రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగతా నిధులు విడుదల చేయాలని ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కానుందున.. మిషన్ కాలపరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని కోరారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్‌లో పనులు చేపట్టినట్లు తెలిపారు. వరంగల్‌లో ఇవి 45 పనులు పూర్తయ్యాయని, రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక కరీంనగర్‌లో 25 పనులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ
సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నట్లు తెలిసింది. సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై.. పీసీసీకి నూతన అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలో లోక్‌సభ సీట్లు ఆశించిన దానికన్నా తక్కువ రావడంపై ఇటీవల పార్టీ కమిటీని ఏర్పాటు చేసిన దృష్ట్యా.. ఆ అంశంపైనా చర్చిస్తారని తెలిసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరిక అంశాన్ని సైతం అధినాయకత్వం దృష్టికి రేవంత్ తీసుకెళ్లనున్నారు. మరో 13 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరే అంశాన్ని అగ్రనేతల వద్ద ప్రస్తావిస్తారని తెలిసింది. కాగా.. కాంగ్రెస్ ఎంపీల ప్రమాణాస్వీకారానికి కూడా సీఎం రేవంత్ హాజరుకానున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ప్రమాణం చేయనున్నారు. రాహుల్ ప్రమాణ కార్యక్రమం సమయంలో కూడా రేవంత్ ఉండే అవకాశాలున్నాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ నేరుగా తుగ్లక్‌రోడ్‌లోని తన నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఎంపీలతోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్కతో సీఎం సమావేశమయ్యారు.
Updated Date - Jun 25 , 2024 | 05:09 AM