Sanjay Gaikwad : రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా
ABN, Publish Date - Sep 17 , 2024 | 04:00 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు
ముంబై, సెప్టెంబరు 16: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నాలుక కోసిన వారికి రూ. 11 లక్షలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. ‘‘ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన ఓ సమావేశంలో రిజర్వేషన్లను పూర్తిగా అంతం చేయాలని రాహుల్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఆ వ్యాఖ్యలే నిదర్శనం. కాబట్టే ఆయన నాలుక కోసిన వారికి నజరానా ప్రకటిస్తున్నాన’’ని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రచారం చేసిన రాహుల్... బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అసత్యాలు ప్రచారం చేశాడని, కానీ ఇప్పుడు ఆయన నిజస్వరూపం బయటపడిందన్నారు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. సంజయ్‌పై బూల్దానా ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Sep 17 , 2024 | 04:00 AM