Loksabha polls: మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటు సుఖాంతం, ఇక యూపీపై కాంగ్రెస్ దృష్టి..
ABN, Publish Date - Jan 09 , 2024 | 09:31 PM
మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై మహా వికాస్ అఘాడి మధ్య అవగాహన కుదిరింది. మహావికాస్ అఘాడిలో శివసేన యూబీటీ, శరద్ పవార్ ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ భాగస్వాములుగా ఉన్నాయి. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను మూడు భాగస్వామ్య పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు ఆయా పక్షాల నేతలు తెలిపారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర (Maharashtra) లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై మహా వికాస్ అఘాడి (Maha Vikas Aghadi) మధ్య అవగాహన కుదిరింది. మహావికాస్ అఘాడిలో శివసేన యూబీటీ, శరద్ పవార్ ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ భాగస్వాములుగా ఉన్నాయి. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను మూడు భాగస్వామ్య పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు ఆయా పక్షాల నేతలు తెలిపారు. మంగళవారంనాడిక్కడ సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో ఈ అవగాహన కుదిరింది. అయితే ఎవరికి ఎన్ని సీట్లనేది నేతలు వెంటనే ప్రకటించలేదు.
మహా వికాస్ అఘాడి సమావేశానంతరం శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ, తామంతా కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని స్పష్టం చేశారు. అందరికంటే ముందే సీట్లు ప్రకటించే రాష్ట్రం తమదే (మహారాష్ట్ర) కానుందని చెప్పారు. కాగా, శివసేనలో చీలిక వచ్చి ఉండవచ్చని, కానీ ప్రజలంతా ఉద్ధవ్ వర్గంతోనూ, అలాగే ఎన్‌సీపీతోనూ ఉన్నారని, తామంతా కలిసే ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రమేష్ చెన్నితాల తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున హాజరైన సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ, సమావేశం చాలా బాగా జరిగిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ విషయంలోనూ ఇదే తరహాలో సీట్ల షేరింగ్‌పై ముందుకు వెళ్తామని చెప్పారు.
Updated Date - Jan 09 , 2024 | 09:31 PM