Fire Accident: తమిళనాడు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Dec 13 , 2024 | 05:41 AM
తమిళనాడులో దిండుగల్‌లోని సిటీ ఆస్పత్రిలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
ఏడుగురు సజీవ దహనం
షార్ట్ సర్క్యూటే ఘటనకు కారణం?
చెన్నై, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో దిండుగల్‌లోని సిటీ ఆస్పత్రిలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. తిరుచ్చి, దిండుగల్ జాతీయ రహదారిపై ఉన్న సిటీ ఆస్పత్రిలో రాత్రి 10 గంటల ప్రాంతంలో మంటలు సంభవించాయి. నాలుగు అంతస్తుల భవనమున్న ఈ ఆస్పత్రి దిగువ ఫ్లోర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఏం జరిగిందో గ్రహించేలోపే మంటలు వార్డులకు వ్యాపించాయి. దీంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీసారు. ఆ సమయంలో లిఫ్టులో ఉన్న ముగ్గురు మహిళలు, ఒక బాలుడు మంటలకు బలయ్యారు. మరో ముగ్గురి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో రోగులే ఎక్కువ ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చాయి. సుమారు 50 అంబులెన్సుల్లో రోగులను, క్షతగాత్రులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు దిండుగల్ జిల్లా పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఐ.పెరియస్వామి, దిండుగల్ కలెక్టర్ ఎం.ఎన్.పూంగుడి, ఎస్పీ ప్రదీప్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక కూడా మంటలు అదుపులోకి రాలేదు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Updated Date - Dec 13 , 2024 | 05:41 AM