సారీ నాన్నా అమ్మను చంపేశా
ABN, Publish Date - Nov 10 , 2024 | 03:55 AM
‘సారీ నాన్నా! అమ్మను చంపేశా!’..ఓ తండ్రితో పెద్ద కుమారుడు అన్న మాటలవి. హత్యకు కారణం-కెనడా వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, అందుకు మంత్రాలు వేస్తోందని అనుమానించడం... ఢిల్లీలో జరిగిన ఈ దారుణం కలవరపరిచింది.
మంత్రాలు చేస్తూ తనను కెనడా వెళ్లకుండా అడ్డుకుంటోందని ఓ కుమారుడి ఘాతుకం
న్యూఢిల్లీ, నవంబరు 9: ‘సారీ నాన్నా! అమ్మను చంపేశా!’..ఓ తండ్రితో పెద్ద కుమారుడు అన్న మాటలవి. హత్యకు కారణం-కెనడా వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, అందుకు మంత్రాలు వేస్తోందని అనుమానించడం... ఢిల్లీలో జరిగిన ఈ దారుణం కలవరపరిచింది. నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి బుధవారం సాయంత్రం తీవ్రగాయాలతో ఉన్న మహిళను తీసుకొచ్చారు. పరిస్థితిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసు బృందం ప్రాథమిక సమాచారం తెలుసుకొని సంఘటన జరిగిన జైత్‌పూర్‌కు వెళ్లారు. దర్యాప్తు జరిపిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. 31 ఏళ్ల క్రిషన్ కాంత్ తన తల్లిని కత్తితో పొడిచి చంపాడు. వెంటనే ఇంటికి రావాలని తన తండ్రి సూర్జిత్‌కు ఫోన్ చేశాడు. ఆయన వచ్చి చూసే సరికి క్రిషన్ కాంత్ కనిపించాడు.
‘క్షమించండి నాన్నా’ అని వేడుకున్నాడు. మొదటి అంతస్తులోని ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి ఇంట్లోకి వెళ్లగానే బయట గొళ్లెం పెట్టి పారిపోయాడు. ఇంట్లో తన భార్య గీత రక్తం మడుగులో పడి ఉండడం చూసి సుర్జీత్ నిర్ఘాంత పోయాడు. పొరుగువారి సాయంతో తలుపు తీయించి ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. క్రిషన్‌కాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ క్రిషన్‌కాంత్ నిరుద్యోగి. కెనడా వెళ్లి అక్కడ ఉద్యోగం చేయాలన్నది అతడి లక్ష్యం. తల్లి గీత మాత్రం వ్యతిరేకించేంది. దీంతో, మంత్రాలు వేసి తన కెనడా ప్రయాణాన్ని తల్లి అడ్డుకుంటోందని అనుమానం పెంచుకున్న క్రిషన్ ఆమెను చంపేశాడు.
Updated Date - Nov 10 , 2024 | 03:55 AM