Sabarimala: శబరిమలలో నేడే మండల పూజ
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:46 AM
శబరిమలలో మండల పూజోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నందున వర్చువల్ బుకింగ్‌లో 50 వేల మంది.. స్పాట్ బుకింగ్‌లో 5 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది.
శబరిమల, డిసెంబరు 25: శబరిమలలో మండల పూజోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నందున వర్చువల్ బుకింగ్‌లో 50 వేల మంది.. స్పాట్ బుకింగ్‌లో 5 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మండల పూజోత్సవం ప్రారంభమవుతుందని, ఆ తర్వాత నెయ్యాభిషేకం జరిపి.. దర్శనానికి అనుమతిస్తామని, రాత్రి 11 గంటలకు ‘హరివరాసనం’తో ఆలయం తలుపులను మూసివేస్తామని తెలిపింది. మకర విళక్కు సీజన్ సందర్భంగా ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని తిరిగి తెరుస్తామని చెప్పారు. జనవరి 14న మకర విళక్కు పూజలు ఉంటాయని, 18వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుందని వివరించారు. కాగా.. ఆదివారం అరన్ముల పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరిన ‘తంగ అంకి’(వస్త్రాలంకరణ) ఊరేగింపు బుధవారం మధ్యాహ్నం పంపాబేస్‌కు.. సాయంత్రం సన్నిధానానికి చేరుకుంది.
తెలుగు భక్తులకు గాయాలు
పునలూర్-మువత్తుపుళ రాష్ట్ర రహదారిపై జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో తెలంగాణకు చెందిన 11 మంది భక్తులు గాయపడ్డారు. ఎరుమేళి నుంచి పంపాకు బయలుదేరిన భక్తుల కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి ఎక్కిన ఘటనలో ముగ్గురు హైదరాబాద్ భక్తులు గాయపడ్డారు. కోన్ని ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్‌ను ఇన్నోవా ఢీకొన్న ఘటనలో హైదరాబాద్‌కు చెందిన 8 మంది భక్తులకు గాయాలైనట్లు రాణి జిల్లా పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో తమిళనాడుకు చెందిన నలుగురు గాయపడ్డారు.
Updated Date - Dec 26 , 2024 | 05:46 AM