Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:07 AM
యమునానది గంగా నది యొక్క అతి పెద్ద ఉపనది. ఈ నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద పుట్టి అలహాబాదులోని గయ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఈ నది సప్త గంగలలో ఒకటి. అయితే యమునా నదిలో కాలుష్య విష నురుగు కక్కుతోంది. కార్తీక మాసం స్నానాలు చేయడానికి యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.
న్యూఢిల్లీ: గంగలో మునిగితే లభించని పుణ్యం.. యమున నదిలో మునిగితే లభిస్తుందని పురణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పొరపాటున కూడా యమున నదిలో మునిగితే పుణ్యం రావడం దేవుడెరుగు.. రోగాల బారీన పడే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఈ నీటిని చూస్తే హిమనీనాదాల్లోని గడ్డ కంటిన మంచుపలకాలు గుర్తుకువస్తున్నాయా లేదా ఏదైనా భారీ సినిమా కోసం వేసిన స్పెషల్ ఎఫెక్ట్‌లా కనిపిస్తోందా. అయితే మీరు పొరపడినట్లే. నీలి నింగిలో కదలాడుతున్న తెల్లటి మేఘాలు కావు ఇవి. హిమగిరుల్లో కరుగుతున్న మంచుకాదు ఇది.
యమునా తీరానా నల్లటి నీటిలో తెల్లగా తేలియాడుతున్న విషపు నురుగులు ఇవి. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. యమునా నదీలో ప్రవహిస్తున్న అత్యంత విషపు నురుగులు ఇవి. పుణ్యనదుల్లో ఒకటైన యమునా జలాలు అత్యంత కలుషితంగా మారాయనడానికి ప్రత్యేక సాక్ష్యాలు ఇవి. పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు నదిలో కలుస్తుండటంతో విషపు నురుగులు తేలియాడుతున్నాయి. 90 శాతం వ్యర్థ జలాలు, 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్దీ చేయని మురుగు నీటిని కూడా యమునలోకే వదిలేస్తున్నారు. మురుగు నీటిలో పాస్ఫేట్, ఆమ్లాలు ఉంటాయి. ఇవే విషపూరిత నురుగుగా ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ కారణంగానే కొన్ని రోజులుగా యమునా నదిలో భారీగా నురుగులు వస్తున్నాయి. యమునా నదికి పురాణాల్లోనూ ఎంతో ప్రాశస్త్యం ఉంది.
ఇది హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తూ ప్రయాగ వద్ద గంగా నదిలో కలుస్తుంది. గంగా నదికి ఎలాంటి పవిత్రత ఉందో అంతే పవిత్రత, పవనత యమునకు వచ్చాయి. అందుకే గంగా తర్వాత యమునాను పలుకుతారు. అలాంటి పుణ్యనది ఇప్పుడు కాలుష్యానికి అడ్డాగా మారింది. ఒకప్పుడు యమునాలో మునిగితే పుణ్యం వచ్చేది. కానీ ఆ పుణ్యం కోసం మయునాలో మునిగిన వారు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికే వాయు కాలుష్యంతో కకావికలమైన ఢిల్లీవాసులను ఇప్పుడు నీటి కాలుష్యం భయపెడుతోంది. దేశ రాజధాని గుండా ప్రవహించే మయునా నది కాలుష్య కాసారమవుతూ విషాన్ని విరజిమ్ముతోంది. నదిలో కలిసిన రసాయనాల నురుగులుగా తేలుతున్నాయి. నదిలోని నీరు కూడా కనిపించనంత మందంగా రసాయనాల నురుగులు అలుముకున్నాయి. నది మొత్తాన్ని ఆక్రమించేశాయి. ఫ్యాక్టరీల నుంచి మురుగు నీరు, వ్యర్థాలను వదులుతుండటంతో యమునా నదిలో విషపూరితమైన తెల్లటి నురగ ప్రవహిస్తోంది. ఇక కార్తీక మాసం సందర్భంగా ఉత్తర భారతంలో నిర్వహించే ఛత్ పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పూజల్లో భాగంగా గంగా, యమునా నదుల్లో పుణ్య స్నానాలను ఆచరించి సూర్యభగవానుడికి పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహిస్తారు.
Updated Date - Nov 11 , 2024 | 02:12 PM