State Govt: మహిళలకు మరో బంపర్ ఆఫర్.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం?
ABN, Publish Date - May 03 , 2024 | 01:36 PM
మహిళలకు మరో తీపి కబురు చెప్పేందుకు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయ కల్పించిన స్టాలిన్ ప్రభుత్వం.. మున్ముందు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఎలా వుంటుందన్నదానిపై ఆలోచిస్తోంది.
- సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు
చెన్నై: మహిళలకు మరో తీపి కబురు చెప్పేందుకు డీఎంకే ప్రభుత్వం(DMK Govt) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయ కల్పించిన స్టాలిన్ ప్రభుత్వం.. మున్ముందు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఎలా వుంటుందన్నదానిపై ఆలోచిస్తోంది. ఇదే జరిగితే త్వరలోనే మహిళలు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం చేయడం ఖాయం. 2021 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో నగర ప్రాంత బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని డీఎంకే(DMK) హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్.. నగర ప్రాంత బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణించే ఫైలుపై సంతకం చేశారు. ఆ ప్రకారం, చెన్నై సహా అన్ని నగరాల్లో మహిళలు ఆర్డినరీ (వైట్‌బోర్డు) బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో వైట్ బోర్డు బస్సులను మహిళలు గుర్తించేలా బస్సు వెనుక, ముందు భాగాల్లో ‘పింక్’ రంగు పూశారు. ఈ రంగు ఉన్న బస్సుల్లో ‘మహిళలకు ప్రయాణం ఉచితం’ అనే స్టిక్కర్లు అంటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 49 లక్షల మంది మహిళలు ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు రవాణాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఇదికూడా చదవండి: Hyderabad: దొంగలున్నారు జాగ్రత్త.. చోరీలు ఎక్కువయ్యేది వేసవిలోనే
‘పింక్’ బస్సుల్లో రద్దీ...
రాష్ట్ర రాజధాని నగరంలో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంటీసీ) ఆర్డినరీ బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, డీలక్స్ బస్సులు, ఏసీ బస్సులు నడుపుతోంది. ఎంటీసీలో మొత్తం 3,233 బస్సులుండగా, వాటిల్లో 1,600 బస్సులు పింక్‌గా మారాయి. వాటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. కాగా ఆర్డినరీ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉండడంతో పురుషులు కూడా అధిక సంఖ్యలో వాటినే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా బస్సులు నిత్యం రద్దీగా నడుస్తున్నాయి. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆ బస్సులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.
ఇదికూడా చదవండి: Karnataka: మాస్ రేపిస్టుకు మోదీ మద్దతు
నివేదిక తయారీ ప్రారంభం...
ఈ విషయమై రవాణా శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ... సాధారణ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగిందన్నారు. ఈ సదుపాయాన్ని ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు విస్తరించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారన్నదానిపై బేరీజు వేస్తున్నామని, బ్రాడ్‌వే, తాంబరం, గుడువాంజేరి, కిలంబాక్కం, తిరువాన్మియూర్, తిరువొత్తియూర్, పూందమల్లి, షోలింగనల్లూర్ తదితర ముఖ్యమైన మార్గాల్లో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య లెక్కిస్తున్నామన్నారు. రెండు నెలలు వరకు లెక్కిస్తామన్నారు. అలాగే, సాధారణ బస్సుల్లో ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారన్న విషయాన్ని, వారికిచ్చే టిక్కెట్ల ద్వారా లెక్కింపు జరుగుతోందన్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ పథకం పెడితే ఆ బస్సుల సంఖ్య పెంచడం వంటివాటిపైనా అంచనా వేస్తున్నామన్నారు. ఇవన్నీ పూర్తి చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని, ఆ తరువాత ఆయన దానిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఈ పథకం అమలులోకి వచ్చేందుకు ఐదారు నెలలు పడుతుందన్నారు.
ఇదికూడా చదవండి: Chennai: అనారోగ్యంతో ఉన్న విద్యార్థినికి
మంచి స్పందన
మహిళలకు ఉచిత ప్రయాణ పథకం పట్ల మంచి స్పందన వస్తోంది. తమిళనాడు(Tamil Nadu)లో ఈ పథకం విజయవంతమవ్వడంతో అటు ఆంధ్రాలో టీడీపీ కూడా ఈ పథకాన్ని తన మేనిఫెస్టోలో చేర్చింది. ఇక తెలంగాణ అయితే ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే తమకు కేవలం ఆర్డినరీ బస్సు ప్రయాణమేనా, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అదృష్టం లేదా అంటూ పలువురు మహిళలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తులు పంపుతున్నారు. నిజానికి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణంపై గత కొంతకాలంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక స్థితిపై అంచనాకు వచ్చాక దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉచిత ప్రయాణాన్ని ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు పొడిగించడంపై సాధ్యాసాధ్యాలపై సమీక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.
ఇదికూడా చదవండి: Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 03 , 2024 | 01:36 PM