Online Game Case: ఆన్‌లైన్ గేమ్ మోజులో డబ్బులు హాంఫట్.. ఆపై యువకుడు కిడ్నాప్.. తీరా చూస్తే!
ABN , Publish Date - Jan 03 , 2024 | 06:07 PM
ఈరోజుల్లో చాలామంది ఆన్‌లైన్ గేమ్ మోజులో పడి తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏదో ఒకసారి సఫలమవుతామని, పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదిస్తామన్న ఆశతో.. తమ దగ్గరున్న డబ్బంతా తాకట్టు పెట్టేస్తారు. తీరా చేతులు కాలాక..
Online Game Case: ఈరోజుల్లో చాలామంది ఆన్‌లైన్ గేమ్ మోజులో పడి తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏదో ఒకసారి సఫలమవుతామని, పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదిస్తామన్న ఆశతో.. తమ దగ్గరున్న డబ్బంతా తాకట్టు పెట్టేస్తారు. తీరా చేతులు కాలాక.. తమ తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. ఇప్పుడు ఓ యువకుడు కూడా అదే పని చేశాడు. తన సోదరి పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని ఆన్‌లైన్ గేమ్‌లో పోగొట్టిన అతగాడు.. భయంతో ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆ తర్వాత కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన అంకిత్ యాదవ్ అనే విద్యార్థి బీఎస్సీ చదువుతున్నాడు. అతని సోదరి వివాహం ఫిబ్రవరిలో నిశ్చయించారు. ఇందుకోసం తండ్రి పొలం అమ్మి, రూ.5 లక్షల రూపాయలను అంకిత్ ఖాతాలో జమ చేశారు. అయితే.. ఆ మొత్తం డబ్బుని అతగాడు ఒక ఆన్‌లైమ్ గేమ్ ఆడి పోగొట్టాడు. మొదట్లో కొంచెం కొంచెంగా ఆ గేమ్‌లో డబ్బులు పెట్టిన అతగాడు.. తాను గెలిస్తే భారీ డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. కానీ.. అందుకు భిన్నంగా డబ్బంతా పోయింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే.. తనని కొడతారన్న భయంతో తన మామ దగ్గర నుంచి రూ.60 వేలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు గేమ్‌లో పెట్టి, పోగొట్టిన రూ.5 లక్షల్ని తిరిగి రాబట్టాలని అనుకున్నాడు. కానీ.. ఇక్కడ కూడా కథ అడ్డం తిరిగింది. ఆ రూ.60 వేలు కూడా పోయాయి.
ఇక తనకు కుటుంబ సభ్యుల చేతిలో దెబ్బలు తప్పవని, తన పని అయిపోయినట్టేనని భావించిన అంకిత్.. ఆత్మహత్య చేసుకోబోయాడు. అయితే.. ఈ విషయం వరుసకు సోదరులయ్యే నిఖిల్ యాదవ్, శివమ్ యాదవ్‌లకు తెలిసింది. ఆత్మహత్య చేసుకోబోతున్న అతడ్ని ఆపి.. కిడ్నాప్ డ్రామా ఆడాలని సూచించారు. అప్పుడు డబ్బులు పోయిన సంగతిని ఎవ్వరూ పట్టించుకోరని చెప్పారు. వాళ్లిద్దరు చెప్పినట్టుగానే అంకిత్ కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు. వాళ్లిద్దరు పోలీసులకు ఫోన్ చేసి, అంకిత్‌ని ఎవరో అజ్ఞాత కారులో కిడ్నాప్ చేశారని చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఆ ఇద్దరి కదలికలపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అప్పుడు ఈ కిడ్నాప్ వ్యవహారం ఒక నాటకమని వెలుగులోకి వచ్చింది.
తన సోదరి కోసం దాచిపెట్టిన రూ.5 లక్షల డబ్బుని తాను ఆన్‌లైమ్ గేమ్‌లో పోగొట్టానని.. ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్లు తనని మందలిస్తారన్న భయంతో ఆత్మహత్య చేసుకోబోయానని.. అయితే తన సోదరులైన శివమ్, నిఖిల్ తనని ఆపారని అంకిత్ చెప్పాడు. కిడ్నాప్ డ్రామా ఆడితే పరిస్థితులు సద్దుమణుగతాయని వాళ్లు సూచించడంతో.. తాము ఈ పనికి పాల్పడ్డారని చెప్పాడు. ఈ వ్యవహారంలో పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని, దర్యాప్తు చేపట్టారు.