Mumbai: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సునేత్ర
ABN, Publish Date - Jun 13 , 2024 | 04:06 PM
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ గురువారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి సునేత్ర పవార్ బరిలో దిగారు.
న్యూఢిల్లీ, జూన్ 13: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ గురువారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి సునేత్ర పవార్ బరిలో దిగారు. అయితే ఎన్సీపీ అభ్యర్థి, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో సునేత్ర.. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 25వ తేదీన రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.
అయితే ఈ రాజ్యసభ సీటును పలువురు ఆశించారని... అందులో తాను కూడా ఉన్నానని ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి చగన్ భుజ్‌బల్ వెల్లడించారు. కానీ సునేత్ర పవార్‌ను ఈ ఉప ఎన్నికలో బరిలో నిలపాలని పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. మరోవైపు సునేత్ర పవార్‌ను రాజ్యసభకు పంపి.. మోదీ కేబినెట్‌లో ఆమెకు మంత్రి పదవి కేటాయించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పుణే శాఖ ఇటీవల తీర్మానం చేసింది.
ఆ తీర్మానానికి సంబంధించిన లేఖను ఎన్సీపీ అధ్యక్షుడు, సునేత్రి పవార్ భర్త అజిత్ పవార్‌కు పంపారు. మోదీ కేబినెట్‌లో సునేత్ర పవార్‌కు సహాయ మంత్రి కేటాయిస్తే.. పార్టీకి మరింత బలోపేతమవుతుందని పుణే శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇంకోవైపు ప్రధాని మోదీ తన కేబినెట్‌లోకి అజిత్ పవార్‌కు సహాయ మంత్రి పదవి కేటాయించాలని నిర్ణయించారు. కానీ ఈ నిర్ణయాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రంలో బీజేపీతో కలిసి ఎన్సీపీ బరిలో నిలిచింది. అందులోభాగంగా నాలుగు స్థానాల్లో ఎన్సీపీ పోటీ చేసింది. అయితే ఒక్క స్థానంలోనే మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందారు.
ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సహాయ మంత్రి పదవి కేటాయించాలని బీజేపీ నిర్ణయించింది. కానీ గత మోదీ ప్రభుత్వంలో ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కేబినెట్ మంత్రిగా పని చేశారు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం సహాయ మంత్రి పదవి తీసుకునేందుకు అజిత్ పవార్ పార్టీ నిరాకరించింది.
గతేడాది జులైలో ఎన్సీపీ చీలిపోయింది. దీంతో అజిత్ పవార్‌తోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ శిండే ప్రభుత్వంలో చేరారు. దీంతో పార్టీ పేరు, గుర్తు అజిత్ పవార్ వర్గానికి దాఖలు పడ్డాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గం..తన పార్టీకి ఎన్సీపీ (ఎస్పీ)గా కొత్త పేరు పెట్టుకున్న విషయం విధితమే.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 13 , 2024 | 04:06 PM