supreme Court : కవితకు బెయిల్
ABN, Publish Date - Aug 28 , 2024 | 02:57 AM
అయిదు నెలలకు పైగా తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు విముక్తి లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీం.. తిహాడ్ జైలు నుంచి విడుదల
కవిత పాత్రపై ఈడీ, సీబీఐల దర్యాప్తు ముగిసింది.. ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు
అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం.. ఈడీ, సీబీఐల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు
అప్రూవర్లను ఇష్టానుసారం ఎంపిక చేసుకుంటారా?.. ఇతరులను నిందితులుగా వదిలేస్తారా?
పీఎంఎల్‌ఏ సెక్షన్ 45(1) విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు పూర్తిగా తప్పుదోవపట్టింది
మహిళలకు ఇచ్చే మినహాయింపు ఉన్నత విద్యావంతురాలైతే వర్తించదా?
ఆ తీర్పు అమలైతే ఇక చదువుకున్న వారికి బెయుల్ దొరకదు.. ఆ తీర్పును కొట్టేస్తున్నాం: సుప్రీం
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): అయిదు నెలలకు పైగా తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు విముక్తి లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకొని అప్రూవర్లుగా మార్చుకోవటం ఏమిటని ప్రశ్నించింది.
అలాగే, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45(1) కింద మహిళలకు బెయిల్ మంజూరు చేసే నిబంధనను.. కవిత రాజకీయ నాయకురాలు అయినందున వర్తింపజేయలేమన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏ స్థానంలో ఉన్నా మహిళ.. మహిళేనని పేర్కొంది. ఈ మేరకు, బెయిల్ ఇవ్వటానికి నిరాకరిస్తూ హైకోర్టు జూలై 1వ తేదీన ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
రెండు కేసుల్లోనూ రూ.10 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, పాస్‌పోర్టును విచారణ కోర్టు న్యాయమూర్తి వద్ద డిపాజిట్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, స్థానిక ఢిల్లీ కోర్టు జైలు నుంచి కవిత విడుదలకు అనుమతిస్తూ రిలీజ్ వారెంట్లను జారీ చేసింది. దీంతో తిహాడ్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు.
కవితపై దర్యాప్తు పూర్తయ్యింది!
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ అందుకుగల కారణాలను వివరించింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు సంబంధించి ఈడీ, సీబీఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తి చేశాయని గుర్తు చేసింది.
కాబట్టి, ఆమె ఇంకా కస్టడీలో (జైలులో) ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కేసుపై ఢిల్లీ స్థానిక కోర్టులో జరుగుతున్న విచారణను ప్రస్తావిస్తూ.. కేసులో మొత్తం 493 మంది సాక్షులున్నారని, 50 వేల పేజీల పత్రాల ఆధారాలు ఉన్నాయని.. అంతమంది సాక్షులను విచారించి, ఆయా ఆధారాలను కింది కోర్టు పరిశీలించి విచారణను పూర్తి చేయటం సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే విషయం కాదని తేల్చి చెప్పింది. కాబట్టే, కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని తెలిపింది.
మీ దర్యాప్తు నిజాయితీగా లేదు!
విచారణ సందర్భంగా సీబీఐ, ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. కేసులో కొందరు అప్రూవర్లు కవితకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారని పేర్కొన్నారు. ఒక అప్రూవర్ చెప్పిన అంశాలను చదివి వినిపించారు. దీనిపై దర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘మీరు నిజాయితీగా ఉండాలి. కేసులో నిందితుడైన వ్యక్తినే సాక్షిగా మారుస్తున్నారు. రేపు ఎవరినైనా మీ ఇష్ట ప్రకారం ఎంచుకుని అప్రూవర్‌గా తీసుకోవచ్చు. ఇతరులను నిందితులుగా పేర్కొనవచ్చు. ఇదేం పద్ధతి? ఈ విధంగా మీరు వ్యవహరించలేరు.
మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చాలా స్పష్టంగా, సహేతుకంగా తెలుస్తోంది. ఇలాంటిది చూడాల్సి వచ్చినందుకు చింతించాల్సి వస్తోంది’ అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీ రాజు జోక్యం చేసుకోబోయారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘మీరు ఇంకా వివరాల్లోకి వెళ్తామంటే.. మేం కూడా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటాం. దర్యాప్తు సంస్థల నిజాయితీ, నిష్పాక్షికతలను పరిశీలించాల్సి ఉంటుంది.
మీరు వినాలనుకుంటే మరింత సేపు వాదించండి’ అని స్పష్టం చేశారు. దీంతో కవితకు బెయిల్ ఇవ్వొద్దని దాదాపు గంటపాటు వాదించిన ఎస్వీ రాజు మిన్నకుండిపోయారు. అంతకుముందు, కవితను ప్రశ్నించటానికి సమన్లు జారీ చేసినప్పుడే ఆమె తన సెల్‌ఫోన్‌లో కాల్ రికార్డులను, ఫేస్‌టైమ్ డాటాను తొలగించి ఫార్మాట్ చేశారని ఎస్వీ రాజు తెలిపారు. దీనిపై జస్టిస్ విశ్వనాథన్ స్పందిస్తూ.. ఫోన్ అనేది ప్రైవేటు ఉపకరణమని, ఎవరైనా ఫోన్‌లోని వివరాలు ఇతర్లతో పంచుకుంటారా అని ప్రశ్నించారు.
ఫోన్‌లోని మెసేజీలను తొలగించడం మామూలేనని, తనకు కూడా ఆ అలవాటు ఉందన్నారు. స్కూలు, కాలేజీ గ్రూపులు ఎన్నో మెసేజీలను పోస్టు చేస్తుంటాయి.. వాటిని తొలగించటం సాధారణ విషయమన్నారు. అయితే మొత్తం డాటాను తొలగించటం సాక్ష్యాలను ధ్వంసం చేయడమేనని, కవిత చాలా సున్నితమైన డాటాను డిలీట్ చేశారని, దీనిని సాధారణ ఫార్మాటింగ్‌గా భావించరాదని రాజు అన్నారు. దీనికి జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘మీరు నేరం రుజువు చేయకముందే నేరం చేశారని భావిస్తున్నారు. ఆమె నేరం చేసినట్లు మీ వద్ద సాక్ష్యాలేమున్నాయి’ అని ప్రశ్నించారు.
అందరూ సమానమంటారు కదా?
విచారణ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ 45(1)పై ధర్మాసనం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళలకు బెయిల్ ఇచ్చే అంశంలో చట్టం కొన్ని మినహాయింపులు ఇచ్చిందని.. పీఎంఎల్‌ఏ సెక్షన్ 45(1) కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తోందని తెలిపింది. ఈ సెక్షన్ ప్రకారం.. నిందితుడు నేరానికి పాల్పడలేదని, బెయిల్ మీద విడుదలైతే ఎటువంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని న్యాయమూర్తి భావించినప్పుడు బెయిల్ ఇవ్వవచ్చు.
అయితే, మహిళలతోపాటు కొన్ని వర్గాల నిందితులకు ఈ రెండు షరతులను కూడా పక్కనపెట్టి బెయిల్ ఇచ్చే అవకాశం సెక్షన్ 45(1) కల్పిస్తోంది. దీనికి అనుగుణంగా తనకు బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కవిత తరఫు న్యాయవాదులు కోరినప్పుడు.. ‘కవిత ఉన్నత విద్యావంతురాలు. రాజకీయాల్లో, సామాజికసేవలో తనదైన ముద్ర వేశారు. కాబట్టి, ఆమెను అణచివేతకు గురైన ఓ సాధారణ మహిళగా చూడలేం’ అంటూ హైకోర్టు బెయిల్‌ను నిరాకరించింది. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా స్పందించింది.
అందరినీ సమానంగా చూడాలని, సీఎం అయినా ఎంపీ అయినా ఎటువంటి మినహాయింపు ఇవ్వరాదని దర్యాప్తు సంస్థలు తమ ఎదుట తరచూ వాదిస్తున్న సంగతిని గుర్తు చేసింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరితే సీబీఐ, ఈడీలు అందుకు అభ్యంతరం తెలుపుతూ.. సీఎం అయినా, సాధారణ వ్యక్తి అయినా ఒక్కటేనని వాదించాయి.
సుప్రీంకోర్టు తాజాగా దీనినే పరోక్షంగా ప్రస్తావించింది. కవితను అందరు మహిళలతో సమానంగా హైకోర్టు చూడలేదని, ఆమెకు సెక్షన్ 45(1) ద్వారా లబ్ధి జరగకుండా అడ్డుకోవటం ద్వారా తీర్పు విషయంలో హైకోర్టు పూర్తిగా తప్పుదోవపట్టిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పూర్తిగా పక్కనపెడుతున్నామని, లేకపోతే ఆ కోర్టు పరిధిలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో విద్యావంతులైన మహిళలకు బెయిల్ లభించటం కష్టమవుతుందని తెలిపింది.
సిసోడియా బెయిల్ అంశం ప్రస్తావన
కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇదే కేసులో సహ నిందితుడైన మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ, విచారణలో ఆలస్యం జరిగినప్పుడు బెయిల్ మంజూరు చేసే విషయం పరిశీలించాలని తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
సీబీఐ, ఈడీ ఛార్జిషీట్, ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను దాఖలు చేశాయని, కవిత ఇప్పటికే ఈడీ కేసులో అయిదు నెలలు, సీబీఐ కేసులో నాలుగు నెలలు జైలులో గడిపారన్నారు. రెండు కేసుల్లో 493 మంది సాక్షులతోపాటు, 50 వేల పేజీలకు పైగా పత్రాలు ఉన్నాయని, సమీప భవిష్యత్తులో కింది కోర్టులో విచారణ ముగిసే అవకాశం లేదన్నారు.
కవిత మాజీ ఎంపీ, శాసనమండలి సభ్యురాలని.. ఆమె ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని చెప్పారు. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45(1) కవితకు వర్తించదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రశ్నించారు. కవిత నుంచి ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐలు ఎలాంటి డబ్బునూ స్వాధీన పరుచుకోలేదని రోహత్గీ గుర్తు చేశారు. కవిత తన పాత సెల్‌ఫోన్లను తన వద్ద పని చేసే వారికి ఇచ్చారని, ఇచ్చేముందు వాటిని ఫార్మాట్ చేశారని, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయటానికే ఇలా చేశారన్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు.
కాగా అరుణ్ పిళ్లై వాంగ్మూలాన్ని ఏఎ్‌సజీ రాజు ప్రస్తావించినప్పుడు.. స్వతంత్ర సాక్ష్యాలు లేనప్పుడు సహ నిందితుడి ప్రకటనలపైనే పూర్తిగా ఆధారపడవచ్చా అని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. రాఘవ్ మాగుంట, బుచ్చిబాబు కూడా వాంగ్మూలాలు సమర్పించారని రాజు తెలుపగా.. వీరంతా అప్రూవర్లుగా మారక ముందు కవిత పేరు ఎక్కడా చెప్పలేదని రోహత్గీ గుర్తు చేశారు. అప్రూవర్లు చేసిన కళంకిత ప్రకటనలు తప్ప ఎలాంటి సాక్ష్యాలు ఈడీ, సీబీఐల వద్ద లేవన్నారు.
మద్యం కుంభకోణంలో కవిత పాత్రను ముందు నుంచి వివరిస్తానని రాజు చెప్పగా రోహత్గీ అడ్డుకున్నారు. కింది కోర్టులో మాదిరిగా ఇక్కడ వాదనలు చేయకూడదని జస్టిస్ విశ్వనాథన్ ఇరువర్గాలకు చెప్పారు. గంటలకు గంటలు మీ వాదనలను వినలేమని ఆయన రాజుకు తెలిపారు.
బెయిల్‌పై విస్తృత వాదనలు అక్కర్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో వాస్తవాలున్నాయా లేదా అన్న వాటి జోలికి పోవడం లేదని, అప్రూవర్లుగా మారి, క్షమాభిక్ష పొందిన సాక్షుల ప్రకటనలపైనే ఆధారపడటం సరైంది కాదని తెలిపింది.
కవిత అరెస్టు అక్రమమని సుప్రీం చెప్పింది..
కవితను అరెస్టు చేయడానికి దర్యాప్తు సంస్థల దగ్గర అసలు మెటీరియల్ లేనేలేదు. అరెస్టు అక్రమం అని మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఈ రోజు సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది. ఈ కేసులో 500 మంది సాక్షులు ఉన్నారు. అందరినీ విచారించడానికి సుమారు 20 వేల రోజులు పడుతుంది. నేరం రుజువైతే ఏడేళ్ల శిక్ష పడే కేసు ఇది.
కవితకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఎటువంటి సాక్ష్యం లేదు. కడిగీన ముత్యంలా బయటికి వస్తానని అరెస్టు అయినప్పుడు కవిత చెప్పారు. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూేస్త అది నిజం కాబోతుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా రూ.10 లక్షల పూచీకత్తు, పాస్ పోర్టు సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు బెయిల్ వచ్చింది. తర్వాత కేసు కూడా వీగిపోతుంది
- మోహిత్ రావు, కవిత తరఫున మొదటి నుంచి ఉన్న న్యాయవాది
Updated Date - Aug 28 , 2024 | 02:57 AM