ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: సమీక్ష అక్కర్లేదు..

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:46 AM

ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్డ్‌ కులాల ఉప వర్గీకరణ చేసుకోవచ్చని, ఆ అధికారం రాష్ట్రాలకు ఉందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 1న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • ‘ఎస్సీ వర్గీకరణ’పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

  • రివ్యూ పిటిషన్ల కొట్టివేత

న్యూఢిల్లీ, అక్టోబరు 4: ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్డ్‌ కులాల ఉప వర్గీకరణ చేసుకోవచ్చని, ఆ అధికారం రాష్ట్రాలకు ఉందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 1న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజారిటీతో ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, విక్రమ్‌ నాథ్‌, బేలా త్రివేది, పంకజ్‌ మిత్తల్‌, మనోజ్‌ మిశ్రా, సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం.. తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘‘పిటిషన్లు అన్నింటినీ పరిశీలించాం. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సిన అవసరం కనిపించలేదు.


పిటిషన్లను కొట్టివేస్తున్నాం’’ అని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. గతంలో రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నమైన తీర్పు ఇచ్చిన ఏకైక జడ్జి జస్టిస్‌ బేలా త్రివేది కూడా పిటిషన్ల కొట్టివేతకు మద్దతు తెలపడం విశేషం. రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తూ గత నెల 24న ధర్మాసనం తీర్పు ఇవ్వగా.. శుక్రవారం దాన్ని అప్‌లోడ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణకు అవకాశం లేదంటూ 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఆగస్టు 1న సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది. ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించి, అదే వర్గంలో అత్యంత వెనకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది. అయితే న్యాయసమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దిష్ట గణాంకాల ఆధారంగా, అత్యంత వెనకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని పేర్కొంది. రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటే వాటిని న్యాయస్థానాలు సమీక్షించవచ్చని తెలిపింది.


  • ఖనిజ సంపదపై పన్ను అధికారం రాష్ట్రాలదే

ఖనిజ సంపదపై రాష్ట్రాలు పన్ను విధించవచ్చంటూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గనులు, ఖనిజాలతో కూడిన భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకే ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది జూలై 25న సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని గనులు, ఖనిజాలపై కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని పక్కనపెట్టేలా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 8:1 ఆధిక్యంతో తీర్పు ఇచ్చింది. గనులు, ఖనిజాలపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని, కేంద్రానిది కాదని స్పష్టం చేసింది. ఆ తీర్పును సమీక్షించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లన్నింటినీ పరిశీలించామని.. తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు గత నెల 24నే తీర్పు వెలువడగా.. ఇటీవల ఆ కాపీని అప్‌లోడ్‌ చేశారు.


  • విమర్శించినంత మాత్రాన పాత్రికేయులపై కేసులా?

ప్రభుత్వంపై విమర్శలు చేశారన్న కారణంతో పాత్రికేయులపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో భావ స్వేచ్ఛ హక్కును గౌరవించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ హక్కుకు రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణం ప్రకారం రక్షణ ఉంటుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ రాష్ట్రానికి చెందిన జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘యాదవ్‌ రాజ్‌ వర్సెస్‌ ఠాకూర్‌ రాజ్‌’ అన్న శీర్షిక కింద ‘ప్రభుత్వ యంత్రాంగంలో కుల సమీకరణలపై’ ఆ పాత్రికేయుడు ఓ వ్యాసాన్ని రాశారు.


కీలక పదవుల్లో అధికారులను నియమించడంలో ‘కుల పరంగా మొగ్గు’ కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం లఖ్‌నవూలోని హజరత్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌లో గత నెల 20న ఆయనపై కేసు పెట్టింది. భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. జాతి సమగ్రతకు భంగం కలిగించడం, మతపర విద్వేషాలను రెచ్చగొట్టడం, పరువు నష్టం కలిగించడం సహా పలు ఆరోపణలు చేసింది. దీన్ని కొట్టివేయాలని కోరుతూ ఆయన చేసిన వినతిపై విచారణ జరిపిన ధర్మాసనం..ఇలాంటి కథనాలను ప్రభుత్వంపై చేసిన విమర్శలుగా భావించి క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని తెలిపింది.ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది.

Updated Date - Oct 05 , 2024 | 04:46 AM