Supreme Court : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
ABN, Publish Date - Jul 13 , 2024 | 04:37 AM
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్నారు.
ఈడీ కేసులో మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. పలు షరతులు
సీబీఐ కేసులో 25వరకు కస్టడీ
మరోవైపు సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని 25 వరకు పొడిగించిన ప్రత్యేక కోర్టు
బెయిలొచ్చినా జైల్లోనే ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన కొన్ని చట్టపరమైన ప్రశ్నలను విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సి ఉందని సుప్రీంకోర్టు న్యాయమార్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం అభిప్రాయపడింది.
మధ్యంతర బెయిల్‌ను పొడిగించేందుకు, రద్దు చేసేందుకు విస్తృత ధర్మాసనానికి అధికారాలు ఉన్నాయని తెలిపింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చినా.. కేజ్రీవాల్‌కు నిరాశే మిగిలింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.
శుక్రవారంతో ఆయన కస్టడీ ముగియడంతో ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. దీంతో కేజ్రీవాల్ తిహాడ్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, మధ్యంతర బెయిల్‌పై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని చెప్పినంత మాత్రాన ఆయనపై మనీలాండరింగ్ చట్టం కింద ఉన్న ఆరోపణలను తిరస్కరించినట్లు కాదని జస్టిస్ ఖన్నా చెప్పారు.
మధ్యంతర బెయిల్ కాలంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ, ఢిల్లీ సచివాలయానికి కానీ వెళ్లరాదని ధర్మాసనం ఆంక్షలు విధించింది. ఇక కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న వాదనపై స్పందిస్తూ.. ఆయన ఎన్నికైన నాయకుడని తమకు తెలుసని, గద్దె దిగాల్సిందిగా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
సత్యానికి లభించిన గెలుపు
సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని ఆప్ స్వాగతించింది. ఇది సత్యానికి లభించిన విజయమని, బీజేపీ కుట్రలకు దక్కిన ఓటమి అని పేర్కొంది. ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేసింది. ప్రతి కోర్టూ కేజ్రీవాల్‌పై బీజేపీ కుట్రను బహిర్గతం చేసిందని ఢిల్లీ మంత్రి అతిషీ వ్యాఖ్యానించారు.
ఇదేం గెలుపు కాదు: బీజేపీ
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిలు వచ్చినంత మాత్రాన ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించినట్లు కాదని బీజేపీ పేర్కొంది. కేజ్రీవాల్‌పై ఆరోపణలకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిన విషయాన్ని మరిచిపోరాదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు నేరాలకు పాల్పడితే తమ పదవులకు రాజీనామా చేయాలని సుప్రీంకోర్టు సూచించిందని, కేజ్రీవాల్ మొండి వైఖరి వల్ల డిల్లీలో పాలన స్తంభించిపోయిందని బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ చెప్పారు.
Updated Date - Jul 13 , 2024 | 04:37 AM