Supreme Court : కోల్‌కతా హత్యాచారంపై సుప్రీంకోర్టు విచారణ
ABN , Publish Date - Aug 19 , 2024 | 05:30 AM
కోల్‌కతా హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై మంగళవారం
సుమోటోగా తీసుకున్న కోర్టు
రేపు సీజేఐ ధర్మాసనం ముందుకు
నిందితుడికి మానసిక పరీక్షలు
శాంతిభద్రతలపై ప్రతి 2గంటలకు
రాష్ట్రాలు నివేదిక పంపాలి: కేంద్రం
హడావుడిగా నా బిడ్డ అంత్యక్రియలు
దీనిపై అనుమానాలు ఉన్నాయి
న్యాయం జరిగేదాకా సాయం తీసుకోం
ట్రైనీ డాక్టర్ తండ్రి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 18: కోల్‌కతా హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై మంగళవారం విచారణ జరపనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో వివరాలను వెల్లడించారు. 20న విచారించనున్న కేసుల జాబితాలో ఇది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, జూనియర్ డాక్టర్‌పై దారుణంగా లైంగికదాడికి పాల్పడి, హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌రాయ్‌కి ఆదివారం మానసిక పరీక్షలు జరిపారు. ఢిల్లీ నుంచి కోల్‌కతాకు వచ్చిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన మానసిక విశ్లేషకులు ఈ పరీక్షలు నిర్వహించారు. కోల్‌కతా పోలీస్ విభాగంలో పౌర వలంటీర్‌గా 2019లో చేరిన సంజయ్‌రాయ్ ఇప్పటికి నాలుగుసార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడని, అతడొక తిరుగుబోతు అని, బాక్సింగ్‌లో ప్రవేశం ఉందని వెల్లడైంది. తాజా ఘటన అనంతరం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పదవి నుంచి వైదొలిగిన సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు ఆదివారం కూడా విచారించారు.
ఆయన ఫోన్‌కాల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. హత్యాచారం ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో సీబీఐ దర్యాప్తు బృందం త్రీడీ లేజర్ మ్యాపింగ్ నిర్వహించింది. కాగా, హత్యాచారానికి బలైన జూనియర్ డాక్టర్ పేరు వెల్లడిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి రచనా బెనర్జీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఆ వీడియోను తొలగించి క్షమాపణ చెప్పారు. ఇదిలా ఉండగా, కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతీ రెండు గంటలకోసారి తమకు నివేదిక పంపించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ ఈ నెల 16న ఆదేశాలు జారీ చేసినట్లుగా తాజాగా వెల్లడైంది. ఈ మేరకు రాష్ట్రాల పోలీసు విభాగాలు కేంద్ర హోంశాఖకు నివేదికలు పంపుతున్నాయి.