కారాగారాల్లో కుల వివక్ష సరికాదు
ABN, Publish Date - Oct 04 , 2024 | 03:54 AM
జైళ్లలో కులం ఆధారంగా ఖైదీలకు పనులు కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది.
జైళ్ల నిబంధనలు మార్చాలని సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, అక్టోబరు 3: జైళ్లలో కులం ఆధారంగా ఖైదీలకు పనులు కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. కులాల ఆధారంగా ఖైదీలను ప్రత్యేక వార్డుల్లో ఉంచడం, పనుల కేటాయింపులోనూ కుల వివక్ష చూపడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పలు రాష్ట్రాల తీరును తప్పుపట్టింది. ఇలాంటి వివక్షను అడ్డుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. జైళ్లలో కుల వివక్ష చూపుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
కారాగారాల్లో కులం ఆధారంగా ఊడవడం, మురుగు శుభ్రం చేయడం వంటి పనులు అప్పగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల వారికి మురుగు శుభ్రం చేయడం, ఊడవడం వంటి పనులు చెబుతున్నారని.. అగ్రవర్ణాల వారికి వంట పనులు వంటివి అప్పగిస్తున్నారని తెలిపారు. జైళ్లలో కుల వివక్ష సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల వివక్షను అడ్డుకోవడంలో రాష్ట్రాలు సానుకూల దృక్పథంతో పనిచేయాలని తీర్పులో స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రాలు జైళ్ల నిబంధనల్లో మార్పులు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అందుకు మూడు నెలల గడువు ఇచ్చింది.
Updated Date - Oct 04 , 2024 | 03:55 AM