ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: ఖనిజ సంపదపై రాష్ట్రాలు పన్ను విధించవచ్చు!

ABN, Publish Date - Jul 26 , 2024 | 05:51 AM

గనులపై, ఖనిజాలతో కూడిన భూములపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే రాయల్టీ.. పన్ను కాదని తెలిపింది.

  • కేంద్రానికి ఆ అధికారం లేదు

  • కాకపోతే పరిమితులను పేర్కొనవచ్చు

  • రాష్ట్రాలకు చెల్లించే రాయల్టీ పన్ను కాదు సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం

  • పాత బకాయిలపై 31న స్పష్టతనిస్తామన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, జూలై 25: గనులపై, ఖనిజాలతో కూడిన భూములపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే రాయల్టీ.. పన్ను కాదని తెలిపింది. దేశంలో గనులు, ఖనిజాలపై కొనసాగుతున్న కేంద్రం గుత్తాధిపత్యాన్ని పక్కనపెట్టేలా సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు రాష్ట్రాలకు.. ముఖ్యంగా ఖనిజ సంపద అధికంగా ఉన్న ఝార్ఖండ్‌, ఒడిశా వంటి రాష్ట్రాలకు గొప్ప ఊరట కలిగించనుంది. వాటి ఆదాయం గణనీయంగా పెరగనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం 200 పేజీల మెజారిటీ (8:1) తీర్పును వెలువరించింది. జస్టిస్‌ బీవీ నాగరత్న విడిగా తీర్పునిస్తూ.. గనులు, ఖనిజాలున్న భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు లేదని, ఆ అధికారం పార్లమెంటుదేనని పేర్కొన్నారు. రాయల్టీ పన్ను వంటిదేనన్నారు.


కాగా, మిగిలిన 8 మంది న్యాయమూర్తుల తరఫున సీజేఐ తీర్పును చదవి వినిపించారు. ఈ మెజారిటీ తీర్పు ప్రకారం.. రాజ్యాంగంలోని రెండో జాబితాలో ఉన్న ఎంట్రీ 49 (ఆర్టికల్‌ 246) మేరకు భూములు, భవనాలు, గనులు, క్వారీలపై రాష్ట్ర శాసనసభ పన్ను విధించవచ్చు. ఉత్పత్తి అయ్యే ఖనిజాల పరిమాణం ఆధారంగా పన్ను నిర్ణయించవచ్చు. రాజ్యాంగంలోని తొలి జాబితాలో ఉన్న ఎంట్రీ 54 పరిధిలోని ఖనిజాల హక్కులపై పన్ను విధించే చట్టబద్ధ అధికారం పార్లమెంటుకు లేదు. ఖనిజాలపై ఆయా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే రాయల్టీ.. పన్ను కాదు. అయితే, ఖనిజాల హక్కులకు సంబంధించి పన్నులు విధించే రాష్ట్రాల మీద పార్లమెంటు ఏవైనా పరిమితుల్ని నిర్దేశించవచ్చు. రాజ్యాంగంలోని రెండో జాబితాలో ఉన్న ఎంట్రీ 50 ప్రకారం, ఆ పరిమితులు.. ఆంక్షలు, షరతులు, నిబంధనలు, మొత్తంగా నిషేధం కూడా కావచ్చు. దేశంలో ఖనిజాభివృద్ధికి సంబంధించి పార్లమెంటు చేసే చట్టాలకు లోబడే ఏవైనా పన్నులు విధించాలని ఎంట్రీ 50 చెబుతోంది.


ఆ తీర్పు సరైనది కాదు

రాయల్టీని పన్నుగా పేర్కొంటూ 1989లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు సరైనది కాదని మెజారిటీ తీర్పు పేర్కొంది. మైనింగ్‌ లీజు తీసుకున్న సంస్థ కాంట్రాక్టు ప్రకారం చెల్లించే రాయల్టీ.. పన్ను వంటిది కాదని తెలిపింది. కాబట్టి, 1989లో ఇండియన్‌ సిమెంట్స్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సీజేఐ తమ తీర్పులో.. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టాన్ని (ఎంఎండీఆర్‌ఏ) ప్రస్తావించారు. ఖనిజాలు, ఖనిజ అభివృద్ధిపై పన్ను విధించకుండా ఈ చట్టంలో ఎటువంటి ఆంక్షలు లేవని గుర్తు చేశారు. అలాగే, ఈ చట్టం ప్రకారం రాయల్టీ.. పన్ను కాదని తెలిపారు. గనులు, ఖనిజాలు, ఖనిజాలతో కూడిన భూములపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్రాలకు ఉందని పేర్కొన్నారు. ధర్మాసనంలో జస్టిస్‌ చంద్రచూడ్‌తోపాటు జస్టి్‌సలు రిషికేశ్‌ రాయ్‌, అభయ్‌ ఓకా, జేబీ పార్ధివాలా, మనోజ్‌ మిశ్రా, ఉజ్వల్‌ భుయాన్‌, సతీశ్‌చంద్ర శర్మ, అగస్టీన్‌ జార్జ్‌ మాసి, నాగరత్న ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఈ వివాదాస్పద అంశంపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.


నేపథ్యం ఇదీ..

ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో గతంలో ఓ మైనింగ్‌ లీజు పొందిన ఇండియా సిమెంట్స్‌ కంపెనీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తూ వచ్చింది. అయితే, రాయల్టీతోపాటు సెస్‌ కూడా చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించటంతో ఇండియా సిమెంట్స్‌ కంపెనీ మద్రాస్‌ హైకోర్టులో ఆ ఆదేశాల్ని సవాల్‌ చేసింది. రాయల్టీపై సెస్సు అనేది పన్ను వంటిదేనని, ఈ విధంగా పన్ను విధించటం రాష్ట్ర పరిధిలో లేని అంశమని కోర్టులో వాదించింది. సెస్సు అనేది ల్యాండ్‌ రెవెన్యూలో భాగమని, దానిని విధించే అధికారం తమకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరటంతో 1989లో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఇండియా సిమెంట్స్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎంఎండీఆర్‌ఏ ప్రకారం రాష్ట్రాలు మైనింగ్‌ మీద రాయల్టీ తీసుకోవచ్చుగానీ, అదనంగా పన్ను విధించలేవని, ఆ అధికారం కేంద్రానికి మాత్రమే ఉంద ని పేర్కొంది.


రాయల్టీని కూడా పన్నుగా పరిగణించవచ్చని తెలిపింది. అయితే, 2004లో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం.. 1989 నాటి తీర్పులో ఒక టైపింగ్‌ పొరపాటు దొర్లిందని పేర్కొంది. రాయల్టీ కూడా ట్యాక్సే అనే వాక్యాన్ని రాయల్టీపై విధించే సెస్సు కూడా ట్యాక్సే అని చదువుకోవాలని తెలిపింది. రాయల్టీ పన్ను కాదని స్పష్టం చేసింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పినందున, ఈ అంశాన్ని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేశారు. ఎనిమిది రోజులపాటు విచారణ జరిగింది. మైనింగ్‌, ఖనిజాల మీద పన్ను విధించే అధికారం తమకు ఉందని రాష్ట్రాలు వాదించగా, కేంద్రం, మైనింగ్‌ కంపెనీలు, ప్రభుత్వరంగ సంస్థలు ఖనిజాలు, గనుల మీద పన్ను విధించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని, రాష్ట్రాలకు లేదని వాదించాయి.


పాత బకాయిలు ఇప్పించండి

తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన సందర్భంగా.. గనులు, ఖనిజాలపై పన్ను రూపంలో కేంద్రం ఇప్పటి వరకూ వసూలు చేసిన వేలాది కోట్ల రూపాయలను తమకు తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును తాజాగా కోరాయి. అయితే, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా రాష్ట్రాల వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై రాష్ట్రాలు, కేంద్రం లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని, జూలై 31న తాము తీర్పు చెబుతామని సుప్రీంకోర్టు పేర్కొంది.

Updated Date - Jul 26 , 2024 | 05:51 AM

Advertising
Advertising
<