Supreme Court: నీటి సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్ లోపాలపై ఆగ్రహం
ABN, Publish Date - Jun 10 , 2024 | 03:19 PM
దేశ రాజధాని(Delhi) ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న వేళ సుప్రీం కోర్టు(Supreme Court) ఇటీవలే అక్కడి ప్రభుత్వాన్ని సంక్షోభ నివారణకు తీసుకున్న చర్యలపై పిటిషన్ దాఖలు చేయాలని కోరింది.
ఢిల్లీ: దేశ రాజధాని(Delhi) ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న వేళ సుప్రీం కోర్టు(Supreme Court) ఇటీవలే అక్కడి ప్రభుత్వాన్ని సంక్షోభ నివారణకు తీసుకున్న చర్యలపై పిటిషన్ దాఖలు చేయాలని కోరింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా ఆప్ సర్కార్(AAP) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే ఈ పిటిషన్‌పై సోమవారం విచారించిన ధర్మాసనం దాంట్లోని లోపాలపై మండిపడింది. రాజధానిలో నీటి సంక్షోభాన్ని తగ్గించడానికి హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాలను ఢిల్లీకి తరలించేలా హరియాణాను ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అందులోని లోపాలను సరిదిద్దనందుకు ఢిల్లీ సర్కార్ తీరును సుప్రీం తప్పుబట్టింది.
ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో లోపం కారణంగా రిజిస్ట్రీలో అఫిడవిట్‌లను ఆమోదించడం లేదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలేతో కూడిన బెంచ్ పేర్కొంది."మీరు లోపాన్ని ఎందుకు సరిచేయలేదు? మేము పిటిషన్‌ను కొట్టివేస్తాం. పరిస్థితి తీవ్రత దృష్ట్యా గతంలోనే సరైన వివరాలతో పిటిషన్ దాఖలు చేయాలని కోరాం. కోర్టు విచారణలను తేలికగా తీసుకోకండి" అని కోర్టు పేర్కొంది. అనంతరం కేసు విచారణను జూన్ 12కు వాయిదా వేసింది.
భారీ ఉష్ణోగ్రతలతో నీటి కొరత..
ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాజధాని ప్రజలు అటు ఎండలతో పాటు, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నీరు కావాలని కోరగా సానుకూలింగా స్పందించింది. దీంతో.. సుప్రీంకోర్టు కూడా, ఢిల్లీకి 137 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేయాలని ఆదేశించింది.
హిమాచల్ నుంచి ఢిల్లీకి నీటిని సులభతరం చేయాలని హర్యానాను కోరింది. హిమాచల్ నుంచి అందుతున్న నీటిని ఢిల్లీలోని వజీరాబాద్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా చేరేలా హర్యానా ప్రభుత్వం అనుమతించాలని, తద్వారా ఢిల్లీ ప్రజలకు తాగునీరు అందుతుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కెవి విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ హిమాచల్ అదనపు నీటిని సరఫరా చేయడానికి అంగీకరించిందని తెలిపింది.
నీటి విషయంలో రాజకీయాలు ఉండకూడదని, నీటిని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశం ఇచ్చింది. మండుతున్న ఎండలలో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది.
Read Latest News and National News here..
Updated Date - Jun 10 , 2024 | 03:19 PM