Mohan Bhagwat: మందిర్-మసీదు వివాదాలు పెరగడం ఆందోళనకరం: ఆర్ఎస్ఎస్ చీఫ్
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:21 PM
అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇదే తరహా వివాదాలు రేకెత్తించడం ద్వారా తాముకూడా హిందూ నాయకులు కావచ్చనే అభిప్రాయంతో కొందరు ఉన్నారని, ఇది తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మోహన్ భాగవత్ అన్నారు.
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల కాలంలో మందిర్-మసీద్ వివాదాలు పెరుగుతుండటంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇదే తరహా వివాదాలు రేకెత్తించడం ద్వారా తాముకూడా హిందూ నాయకులు కావచ్చనే అభిప్రాయంతో కొందరు ఉన్నారని, ఇది తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ''ఇండియా-ది విశ్వగురు" అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో భాగవత్ మాట్లాడుతూ, మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు.
Jaipur Literature Festival: ప్రపంచ సాహిత్య మహా కుంభమేళాకు కౌంట్‌డౌన్
''చిరకాలంగా మనం సామరస్యంతో జీవిస్తున్నాం. ప్రపంచానికి సామరస్య సందేశాన్ని అందించాలంటే అందుకు మనం ఆదర్శంగా నిలవాలి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత కొందరు నేతలు కొత్త కొత్త ప్రాంతాల్లో ఇదే తరహా అంశాలను లేవనెత్తడం ద్వారా తాము హిందూ నాయకులు అయిపోతామని అనుకొంటున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతిరోజూ ఒక కొత్త అంశం (వివాదం) లేవనెత్తుతున్నారు. ఇది ఎలా సాగనిస్తాం? ఇదెంత మాత్రం కొనసాగడానికి వీల్లేదు. మేము కలిసికట్టుగా బతుకుతున్నామనే సందేశాన్ని భారత్ చాటుకోవాల్సిన అవసరం ఉంది" అని మోహన్ భాగవత్ అన్నారు.
రాజ్యాంగం ప్రకారమే..
రాజ్యాంగం ప్రకారమే భారతదేశం నడుస్తోందని, ఈ పద్ధతిలోనే తమ ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారని, ఎన్నికైన వారు ప్రభుత్వాన్ని నడుపుతారని భాగవత్ అన్నారు. ఎవరో ఒకరు ఆధిప్యతం చెలాయించే రోజులు పోయాయన్నారు. అందరూ తమను తాము భారతీయులుగా గుర్తించినప్పుడు భాషాధిపత్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ''ఎవరు మైనారిటీ, ఎవరు మెజారిటీ? ఇక్కడ అంతా సమానమే. దేశ ప్రజలు తమకు ఇష్టమైన ఆరాధనా పద్ధతులను అనసరించడమే ఈ దేశ సాంప్రదాయం. అయితే సామరస్యంతో చట్టాలకు లోబడి వ్యవవహరించడం అవసరం" అని భాగవత్ పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో వివిధ ప్రాంతాల్లో తమ ఆలయాలపైనే మసీదులు కట్టారని, మసీదుల సర్వే జరపాలని పలు డిమాండ్లు వెలుగు చూస్తున్న నేపథ్యంలో భాగవత్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మసీదులు ఉన్న ప్రాంతాల్లో ఆలయాల ఆనవాళ్లు ఉన్నాయంటూ పలు పిటిషన్లు కోర్టులకు వస్తుండటం, కోర్టులు సైతం సర్వేలకు ఉత్తర్వులు ఇస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇటీవల పరిగణలోకి తీసుకుంది. మతపరమైన నిర్మాణాలు, స్వభావానికి సంబంధించి కొత్త వ్యాజ్యాలు తీసుకోవద్దని దిగువ కోర్టులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు
Sabarimala: శబరిమలలో మండల పూజకు సిద్ధం
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 20 , 2024 | 05:21 PM