General Elections: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీ!
ABN, Publish Date - Jun 08 , 2024 | 03:39 AM
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్‌గాంధీని ఎన్నుకొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీ వ్యవహరించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవడం పదేళ్లుగా నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ నాయకత్వంలో తిరిగి జాతీయ స్రవంతిలో పుంజుకొని సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడంతో ఆయన్నే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
పార్టీలో అంతర్గతంగా పెరుగుతున్న ఒత్తిడి
నేడు వర్కింగ్ కమిటీ భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ, జూన్ 7(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్‌గాంధీని ఎన్నుకొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీ వ్యవహరించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవడం పదేళ్లుగా నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ నాయకత్వంలో తిరిగి జాతీయ స్రవంతిలో పుంజుకొని సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడంతో ఆయన్నే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఇటీవలి వరకు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశిఽథరూర్ కూడా రాహుల్ పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిన తరుణం వచ్చిందని ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. సాధారణంగా పార్లమెంటరీ పార్టీ లీడరే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి అవుతారు. మోదీ సర్కారు ఏడాదిలోపు పడిపోతుందని గట్టిగా విశ్వసిస్తున్న కాంగ్రెస్.. ఇండీకూటమికి తన ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ని ఇప్పటి నుంచే ప్రొజెక్టు చేయాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం ఢిల్లీలో సమావేశంకానుంది. అశోకా హోటల్‌లో ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ సీఎంలు, వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొంటారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా రాహుల్‌ను ప్రతిపాదిస్తూ తీర్మానం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దాన్ని అనుసరించి, సాయంత్రం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలతో సీపీపీ సమావేశంకానుంది. ఈ భేటీలో రాహుల్‌ను లాంఛనప్రాయంగా సీపీపీ నేతగా ఎన్నుకుంటారని భావిస్తున్నారు.
రాత్రి 7గంటలకు అశోకా హోటల్‌లో సీడబ్ల్యూసీ సభ్యులు, ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుం చి ఎంపీలుగా గెలిచిన మల్లురవి, బలరాంనాయక్‌లు రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
లోక్‌సభలో బలమైన ప్రతిపక్షం
మూడోసారి అధికారంలోకి వస్తున్న మోదీ సర్కారు ఈసారి బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష ఇండియా కూటమికి 233 సీట్లు కట్టబెట్టారు. దీంతో 18వ లోక్‌సభలో కొత్తగా మోదీ నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం తప్పటడుగు వేస్తే ఇండియా కూటమి పార్టీలు విమర్శలతో విరుచుకుపడడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
కర్ణాటక బీజేపీ శాఖ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో 40ు కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ గతేడాది శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కర్ణాటక బీజేపీ శాఖ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
ప్రతిపక్ష నేతగా రాహులే కరెక్ట్
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెరుగైన ఫలితాలు సాధించడంలో రాహుల్ అత్యంత కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శ్లాఘించారు. రాహుల్‌ను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా అభివర్ణించిన ఆయన... లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి పగ్గాలు రాహుల్ చేతికివ్వడమే సరైనదని అభిప్రాయపడ్డారు.
కాంగ్రె్‌సకు పునరుజ్జీవనం తెచ్చిన ఘనత రాహుల్‌దేనన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు... బీజేపీ అహంకారానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నాలుగోసారి ఎంపీగా ఎన్నికైన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చన్నారు.
Updated Date - Jun 08 , 2024 | 03:39 AM