Congress Party : ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్
ABN, Publish Date - Jun 03 , 2024 | 03:56 AM
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శనివారం వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌ను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. తాము మంచి ఫలితాలు సాధించబోతున్నామని, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించింది.
బీజేపీ ఆడుతున్న మైండ్‌గేమ్.. మేం మంచి ఫలితాలు సాధిస్తాం
ఇండియా కూటమిదే అధికారం: కాంగ్రెస్
అవి మోదీ మీడియా పోల్స్.. రాహుల్ గాంధీ విమర్శ
పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఖర్గే, రాహుల్ జూమ్ మీటింగ్
న్యూఢిల్లీ, జూన్ 2: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శనివారం వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌ను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. తాము మంచి ఫలితాలు సాధించబోతున్నామని, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించింది. ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ.. వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడి.. ఫలితాలను తారుమారుచేసేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉందని, పార్టీ నేతలు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్ అని, పదవుల నుంచి దిగిపోనున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సృష్టించినవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు ఆడుతున్న మైండ్‌గేమ్ అని అన్నారు.
మోదీ ఆదివారం అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించడం...తాను మళ్లీ ప్రధాని కాబోతున్నానని వారికి సంకేతం ఇవ్వడం, వారిపై ఒత్తిడి తెచ్చేందుకేనని జైరాం రమేశ్ విమర్శించారు. అలాంటి ఒత్తిళ్లకు అధికారులు భయపడకుండా ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా చూస్తారని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమి పార్టీల సమావేశంలో రాష్ట్రాల వారీగా విశ్లేషణ చేశామని, తమ కూటమికి 295పైనే సీట్లు వస్తాయని, అంతకు తగ్గే అవకాశమే లేదన్నారు.
అవి మోదీ మీడియా పోల్స్: రాహుల్ గాంధీ
ఎగ్జిట్ పోల్స్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కొట్టిపారేశారు. ‘అవి ఎగ్జిట్ పోల్స్ కాదని, ‘మోదీ మీడియా పోల్స్’ అని వ్యాఖ్యానించారు. అవి మోదీ ఊహాగానాలని పేర్కొన్నారు.
ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న విలేకరుల ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ ‘మీరు సిద్ధూ మూసేవాలా పాట ‘295’ విన్నారా? కాబట్టి 295’ అని చెప్పారు. బీజేపీ అనుకూల మీడియా సంస్థలు ఆ పార్టీకి 300 సీట్లకు పైగా కట్టబెడతాయని తాము ముందే చెప్పామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
బీజేపీ ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఉపయోగించుకుని సోమవారం షేర్ మార్కెట్‌లో లాభపడాలని చూస్తోందన్నారు. ఎగ్జిట్ పోల్స్ ‘కార్పొరేట్ గేమ్’, దగా అని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. వాటిని నిర్వహించిన మీడియా సంస్థలపై ఒత్తిడి ఉందన్నారు
Updated Date - Jun 03 , 2024 | 03:56 AM