PM Modi: ‘మెయిన్ కోర్స్’ ముందుంది
ABN, Publish Date - Apr 06 , 2024 | 03:06 AM
గడిచిన పదేళ్ల పాలనలో అభివృద్ధిపై ఆకలి మాత్రమే పుట్టించామని, మెయిన్ కోర్స్ ముందుందని ప్రధాని మోదీ తెలిపారు.
గత పదేళ్లలో అభివృద్ధిపై ఆకలి మాత్రమే పుట్టించాం
అవినీతిపై పోరాటం చేస్తే తప్పా: ప్రధాని మోదీ
జైపూర్, ఏప్రిల్ 5: గడిచిన పదేళ్ల పాలనలో అభివృద్ధిపై ఆకలి మాత్రమే పుట్టించామని, మెయిన్ కోర్స్ ముందుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత సైన్యాన్ని అవమానించడం, ప్రజల్లో విభజన తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విపక్షానికే పరిమితమైందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్న ప్రధాని రెండో రోజైన శుక్రవారం చురు జిల్లాలో బీజేపీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం నవీన భారతంగా ఆవిర్భవించిందన్నారు. పాకిస్థాన్‌లోని శత్రుస్థావరాలపై విరుచుకుపడడమే దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ‘‘ఈ రోజు శత్రువులకు కూడా తెలుసు.. ఇక్కడున్నది మోదీ అని, ఇది నవీన భారతదేశమని’’ అని ప్రధాని తెలిపారు. ‘‘ఇప్పటి వరకు ఏం జరిగిందనేది పెద్ద విషయం కాదు. ఇప్పటి వరకు ఏం జరిగిందనేది కేవలం ట్రైలర్ మాత్రమే. మోదీ ఇప్పటి వరకు చేసింది కేవలం ఆకలి మాత్రమే పుట్టించింది. మెయిన్ కోర్స్ ఇక ప్రారంభంకానుంది’’ అని వివరించారు. గడిచిన పదేళ్ల కాలంలో ఈడీ ఒక్కటే రూ.లక్ష కోట్లకుపైగా అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుందని ప్రధాని తెలిపారు. అవినీతిపై ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్పేంటని ఆయన ప్రజలను ప్రశ్నించారు.
బీజేపీలో చేరిన సుమలత
బెంగళూరు, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటి, మండ్య లోక్‌సభ సభ్యురాలు సుమలత కమలదళంలో చేరారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఏడాదిగా బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌ను ఆశించారు. జేడీఎ్‌సతో పొత్తు కారణంగా మండ్య టిక్కెట్ లభించలేదు. రెండు రోజుల క్రితం బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన సుమలత, శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. మోదీని మరోసారి ప్రధానిగా చూసేందుకు శాయశక్తులా పనిచేస్తానని సుమలత ప్రకటించారు.
Updated Date - Apr 06 , 2024 | 10:22 AM