Farmers Protest: దిల్లీ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. రైతులపై పోలీసుల కర్కశం..
ABN, Publish Date - Feb 14 , 2024 | 12:31 PM
పంజాబ్-హర్యానా సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
పంజాబ్-హర్యానా సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు. భారీ భద్రత, కాంక్రీట్ బారికేడ్లు ఉన్నప్పటికీ రైతులు తమ దిల్లీ చలో మార్చ్‌ను కొనసాగించడంతో శంభు ప్రాంతం వద్ద వందలాది ట్రాక్టర్ లు బారులు తీరాయి. బారికేడ్‌లు దాటి రాకుండా ఉండేందుకు ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. నిరసనల కారణంగా దేశ రాజధాని దిల్లీతో పాటు సమీప నగరాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైతులు దిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దు వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే.. రైతులు రాజధానికి దగ్గరవుతున్న వేళ భద్రతా చర్యలను పెంచే అవకాశం ఉందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు.. కేంద్ర మంత్రి అర్జున్ ముండా రైతు సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అన్ని పక్షాలను పరిగణనలోకి తీసుకుని చర్చలు జరపాలని కోరారు. కాగా.. మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం 2020-21 నిరసనల తర్వాత మరోసారి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ దిల్లీ బాటపట్టారు. వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వం ఇప్పటికే ఎమ్‌ఎస్‌పీని అందజేస్తున్నప్పటికీ దానికి హామీ ఇచ్చే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కోరుతున్నారు.
మరోవైపు.. రైతుల ఆందోళనల కారణంగా హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సాలలో ఫిబ్రవరి 11 ఉదయం ఫిబ్రవరి 13 అర్ధరాత్రి వరకు మొబైల్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 14 , 2024 | 12:31 PM