UK: ఐఎన్ఎల్డీ చీఫ్ హత్యలో యూకేకు చెందిన గ్యాంగ్‌స్టర్ పాత్ర..?
ABN, Publish Date - Feb 27 , 2024 | 10:48 AM
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత నఫే సింగ్ రాథీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాథీ హత్యలో బ్రిటన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ: ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత నఫే సింగ్ రాథీను (Nafe Singh Rathi) హతమార్చింది ఎవరు..? రాజకీయ ప్రత్యర్థులు మట్టుబెట్టారా..? లేదంటే రాథీ హత్యలో మాఫియా హస్తం ఉందా..? రాథీని హత్య చేయాల్సిన అవసరం గ్యాంగ్ స్టర్లకు ఉందా..? హత్య జరిగిన తీరుతో ఈ ప్రశ్నలు వస్తున్నాయి.
బ్రిటన్ గ్యాంగ్ స్టర్..?
నఫే సింగ్ రాథీ (Nafe Singh Rathi) హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాథీ హత్యలో బ్రిటన్‌కు (UK) చెందిన గ్యాంగ్‌స్టర్ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఆ గ్యాంగ్ స్టర్ రాజకీయ నేతలను హతమార్చారని వివరిస్తున్నారు. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం బీజేపీ నేతను మట్టుబెట్టారని పేర్కొన్నారు. ఆ గ్యాంగ్ స్టర్‌కు చెందిన సన్నిహితుడు ఒకడు తీహార్ జైలులో ఉన్నాడు. అతడిని ఈ రోజు హర్యానా పోలీసులు ప్రశ్నిస్తారని తెలిసింది. రాథీ హత్య కేసులో పోర్చుగల్‌లో ఉంటోన్న గ్యాంగ్ స్టర్ హిమాన్షు బావు ప్రమేయం ఉందని పోలీసులు సందేహిస్తున్నారు. జైలులో ఉన్న ఆ గ్యాంగ్ స్టర్ సభ్యులు రాథీని హత్య చేసేందుకు సుఫారీ తీసుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లారెన్స్ బిష్ణోయ్, కాలా జాతేడి..?
రాథీ హత్య కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హిమాన్షు బావు ప్రమేయంతో పాటు లారెన్స్ బిష్ణోయ్, కాలా జాతేడితో సన్నిహితంగా మెలిగే కొందరు షార్ప్ షూటర్లు పాల్గొని ఉంటారని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో గ్యాంగ్ స్టర్లు బిష్ణోయ్, జాతేడితో అనుచరులు దోపిడీ చేయడంతోపాటు హత్య చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకుంటారు. రాథీ హత్య ఇదివరకు జరిగిన హత్యలతో పోలి ఉండటంతో పోలీసుల సందేహాలకు బలం చేకూరుతుంది. రాజ్‌పుత్ కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ హత్య జరిగినట్టే రాథీ హత్య జరిగింది.
15 మంది పేర్లు
రాథీ హత్య కేసులో వీరేంద్ర రాథీ, సందీప్ రాథీ, రాజ్‌పాల్ శర్మ సహా 15 మంది అనుమానితుల పేర్లను పోలీసులు చేర్చారు. మాజీ బీజేపీ ఎమ్మెల్యే నరేష్ కౌశిక్ కూడా ఉన్నారు. రాథీ హత్య జరిగిన ఝాజ్జర్ ప్రాంతాన్ని కేసు విచారిస్తోన్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 27 , 2024 | 10:48 AM