Electoral Bonds: నిబంధనలకు తూట్లు.. పార్టీలకు బాండ్లు
ABN, Publish Date - Apr 11 , 2024 | 07:27 AM
ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) వివాదంలో మరో కొత్త కోణం. కంపెనీ ఏర్పాటైన మూడేళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అర్హత లభిస్తుదని నిర్దేశిత చట్టం స్పష్టం చేస్తున్నప్పటికీ.. పలు కంపెనీలు ఆ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించాయి. పార్టీలకు(Political Parties) విరాళాలు సమర్పించుకున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) వివాదంలో మరో కొత్త కోణం. కంపెనీ ఏర్పాటైన మూడేళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అర్హత లభిస్తుదని నిర్దేశిత చట్టం స్పష్టం చేస్తున్నప్పటికీ.. పలు కంపెనీలు ఆ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించాయి. పార్టీలకు(Political Parties) విరాళాలు సమర్పించుకున్నాయి. దాదాపు 20 కంపెనీలు.. ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు రూ.103 కోట్ల విరాళం ఇచ్చాయని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’ వెల్లడించింది. ఈ కంపెనీల్లో చాలావరకు హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా నడుస్తున్నవేనని, వీటి ద్వారా ఆర్థిక లబ్ధి పొందిన పార్టీల్లో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్ అగ్రస్థానంలో తెలిపింది.
అక్రమ నిధులను అడ్డుకోవటానికి కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 182 ప్రకారం.. ఒక కంపెనీ ఏర్పాటై మూడు ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాతే.. ఆ కంపెనీ ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ రాజకీయపార్టీలకు విరాళం ఇచ్చే అర్హతను సాధిస్తుంది. పార్టీలకు షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల వరద ప్రవహించకుండా ఈ నిబంధన అడ్డుకుంటుంది. దీనిని ఉల్లంఘిస్తే సదరు కంపెనీ ప్రతినిధులకు ఆర్నెళ్ల జైలు శిక్షతోపాటు ఆ కంపెనీ విరాళంగా ఇచ్చిన సొమ్ముకు ఐదు రెట్ల సొమ్మును జరిమానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి స్పష్టమైన నిషేధం ఉన్నప్పటికీ.. దాదాపు 20 కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తూ రూ.103 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను 2021 ఏపిల్ర్-2023 జూన్ మధ్య కొనుగోలు చేశాయి. ఆ సమయానికి ఆ కంపెనీలు ఏర్పాటై మూడేళ్ల గడువు పూర్తి కాలేదు. అయినప్పటికీ, అవి బాండ్లు కొని పార్టీలకు ఇచ్చాయి. ఈ బాండ్ల ద్వారా బీఆర్‌ఎస్ రూ.31.5 కోట్లు, బీజేపీకి రూ.26 కోట్ల విరాళాలు లభించాయి. కాగా, ఈ 20 కంపెనీల్లో 12 కంపెనీలు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి. సదరు 12 కంపెనీలు మొత్తంగా రూ.37.5 కోట్ల బాండ్లను పార్టీలకు విరాళం ఇవ్వగా.. వీటిలో 75శాతం నిధులు బీఆర్‌ఎ్‌సకు లభించగా, మిగిలిన 25శాతం బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు దక్కాయి.
కళ్లు తెరిచి ఏడాది కాకముందే డొనేషన్లు ఈ 20 కంపెనీల్లో ఐదు కంపెనీలు.. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసే నాటికి తొలి వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోలేదు. అంటే, అవి ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. మరో ఏడు కంపెనీలు రెండేళ్లలోపువి. మిగిలిన ఎనిమిది కంపెనీలు మూడేళ్లలోపువి. మరింత విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ 20 కంపెనీల్లో పలు కంపెనీలు కరోనా కారణంగా ఆర్థికమాంద్యం నెలకొన్న 2019 తర్వాత ఏర్పాటయ్యాయి. అయినప్పటికీ, కళ్లు తెరిచిన కొన్ని నెలల్లోనే కోట్లాది రూపాయల బాండ్లను కొనుగోలు చేశాయి. ఉదాహరణకు.. హైదరాబాద్‌కు చెందిన టీ షార్క్స్ ఇన్ర్ఫా డెవలపర్స్, టీ షార్క్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ 2023లో ఏర్పాటయ్యాయి. ఉనికిలోకి వచ్చిన కొన్ని నెలల వ్యవధిలోనే రూ.7.5 కోట్ల బాండ్లను కొని బీఆర్‌ఎ్‌సకు అందించాయి. 2021 నవంబరులో ఏర్పాటైన ఆస్క్ అస్ లాజిస్టిక్స్ కంపెనీ.. ఏడాదిన్నర కూడా కాకముందే రూ.22 కోట్ల బాండ్లను కొని డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీలకు అందించింది. అలాగే, కోయంబత్తూరుకు చెందిన హెచ్‌హెచ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ రూ.15 కోట్ల బాండ్లను బీజేపీకి, రూ.5 కోట్ల బాండ్లను బీజేడీకి సమర్పించింది. అప్పటికి ఆ కంపెనీ ఏర్పాటై మూడేళ్లు పూర్తి కాలేదు. ఈ జాబితా ఈ 20 కంపెనీలకే పరిమితం కాదని ‘హిందూ’ తెలిపింది. కంపెనీల విలీనం తర్వాత ఏర్పాటైన కొత్త కంపెనీలను, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో లేని కంపెనీలను తాము పరిశీలించలేదని వెల్లడించింది. కార్పొరేట్ శాఖ వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా ఆయా కంపెనీల ఆవిర్భావ వివరాలు సేకరించామని తెలియజేసింది.
బాండ్ల పథకానికి ముందే చట్టానికి సవరణ కంపెనీల చట్టం, 1956 ప్రకారం రాజకీయపార్టీలకు ప్రైవేటు కంపెనీలు విరాళాలు ఇవ్వటంపై నిషేధం ఉంది. 1985లో ఈ చట్టంలోని ‘సెక్షన్ 293-ఏ’కు సవరణ జరిపి నిషేధాన్ని తొలగించారు. అయితే, ఆ సందర్భంగా కొన్ని షరతులు విధించారు. వాటి ప్రకారం, 1. పార్టీలకు ప్రభుత్వ సంస్థలు విరాళం ఇవ్వకూడదు 2. విరాళం ఇచ్చే ప్రైవేటు కంపెనీ కనీసం మూడేళ్ల కిందట ఏర్పాటై ఉండాలి 3. మూడేళ్ల కాలవ్యవధిలో వచ్చిన నికర లాభాల్లో 7.5 శాతానికి మించి విరాళం ఇవ్వరాదు. కంపెనీల చట్టం, 2013లో కూడా ఈ నిబంధనలను సెక్షన్ 182 కింద కొనసాగించారు. అయితే, నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత, ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టటానికి ముందు 2017లో సెక్షన్ 182కి సవరణ జరిపారు. దాని ప్రకారం, 7.5 శాతం పరిమితిని తొలగించారు. మూడేళ్లలోపు కంపెనీలు విరాళాలు ఇవ్వొద్దనే నిబంధనను మాత్రం కొనసాగించారు. 7.5 శాతం పరిమితిని ఎత్తివేయటాన్ని అప్పట్లో ఈసీ, ఆర్బీఐ వ్యతిరేకించాయి. ఈ చర్య వల్ల షెల్ కంపెనీల ద్వారా రాజకీయపార్టీలకు నల్లధనం ప్రవహించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. ‘హిందూ’ కథనంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవటానికి ఉన్న రక్షణలను కూడా మోదీ పర్యవేక్షణలో అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు దీనిద్వారా తేలుతోందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 11 , 2024 | 07:27 AM