Puja Khedkar: పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్‌సీ
ABN , Publish Date - Jul 31 , 2024 | 05:30 PM
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్-2022లో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ (Puja Khedkar)పై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్-2022లో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని (Provisional candidature) రద్దు చేసింది. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది.
పుణెలో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి పలు సౌకర్యాలు కల్పించాలని అధికారులను డిమాండ్ చేయడం, కారుపై ఎర్రబుగ్గ లైటు, రాష్ట్ర ప్రభుత్వ నేమ్‌ప్లేట్ వాడటం వంటి చర్యలకు పాల్పడటంతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే యూపీఎస్‌సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన యూపీఎస్సీ ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటే షోకాస్ నోటీసు ఇచ్చింది. జూలై 25వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని యూపీఎస్‌సీ కోరగా, గడువు ఆగస్టు 4 వరకూ పొడిగించాలని ఆమె తిరిగి కోరారు. ఇందుకు యూపీఎస్‌సీ తిరస్కరిస్తూ జూలై 30 వరకూ అదనపు సమయం కల్పించింది. కానీ గడువులోగా ఆమె సమాధానం ఇవ్వలేదని, దీంతో ఆమె ప్రొవెన్షియల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ, భవిష్యత్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయకుండా డిబార్ చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది.
Delhi Coaching Centre Deaths: ఢిల్లీ సర్కార్ 'ఉచితాల సంస్కృతి'ని తప్పుపట్టిన హైకోర్టు
నకిలీ పత్రాలతో పూజా ఖేడ్కర్ పరీక్షలు క్లియర్ చేయడం, తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామ వంటి పత్రాలను మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సార్లు పరీక్షలు రాసినట్టు యూపీఎస్‌సీ గుర్తించింది. ఐపీసీలోని సెక్షన్ 420, 464, 465, 471, 89-91, 66డి కింద కేసులు నమోదు చేసింది.
Read More National News and Latest Telugu News