Joe Biden: ప్రధాని మోదీకి ఫోన్ చేసి మెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కారణమిదే..
ABN , Publish Date - Aug 27 , 2024 | 10:57 AM
ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌కు మానవతా సహాయం, శాంతి సందేశాన్ని అందించినందుకు గాను ప్రశంసించారు. అయితే గతంలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. దీనిపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని(Narendra Modi) మెచ్చుకున్నారు. మోదీతో నిన్న ఫోన్‌లో మాట్లాడిన బైడెన్ ఉక్రెయిన్‌కు మానవతా సహాయం, శాంతి సందేశాన్ని అందించినందుకు గాను ప్రశంసించారు. వాస్తవానికి ప్రధాని మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌ను సందర్శించారు. గతంలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. దీనిపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఇది దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన అని గుర్తుచేశారు. యూఎన్ చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా మోదీ శాంతియుత పరిష్కారం కోసం పనిచేశారని వైట్ హౌస్ లిపింది.
కలిసి పనిచేయడానికి
ఈ నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేందుకు క్వాడ్ (క్వాటర్నరీ సెక్యూరిటీ డైలాగ్) వంటి ప్రాంతీయ సమూహాలతో కలిసి పనిచేయడానికి నిబద్ధతను కల్గి ఉందని ఈ సందర్భంగా వైట్ హౌస్(white house) తెలిపింది. మోదీ ఇటీవల పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనలతో పాటు సెప్టెంబర్‌లో ప్రతిపాదిత ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఇదే సమయంలో బైడెన్‌తో తన సంభాషణలో బంగ్లాదేశ్‌లో పరిస్థితి కూడా చర్చించబడిందని మోదీ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.
చర్చించిన విషయాలివే
బైడెన్‌తో మాట్లాడిన సందర్భంగా ఉక్రెయిన్(Ukraine)లోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై విస్తృతమైన అభిప్రాయాలను చర్చించుకున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. శాంతి, స్థిరత్వం కోసం సంబంధించిన ప్రయత్నాలకు భారతదేశం పూర్తి మద్దతును అందిస్తుందని చెప్పినట్లు ప్రస్తావించారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను, మైనారిటీల పునరుద్ధరణకు సంబంధించిన సమస్యలపై కూడా తాను, బైడెన్ చర్చించినట్లు మోదీ చెప్పారు. హిందువులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించినట్లు తెలిపారు.
అమెరికా సంతోషం
కీవ్‌లో మోదీ(modi) పర్యటన సందర్భంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ముగించేందుకు కలిసి కూర్చోవాలని, శాంతి పునరుద్ధరణలో 'క్రియాశీల పాత్ర' పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి మోదీ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన పట్ల అమెరికా సంతోషం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
IMD: నేడు 14 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఐఎండీ హెచ్చరిక
Jharkhand: జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరేందుకు తేదీ ఖరారు
Delhi : జమ్మూలో బీజేపీ అభ్యర్థులపై రగడ
ఖర్గే కుటుంబ సభ్యులు ఏరో స్పేస్ పారిశ్రామికవేత్తలా?
Read More National News and Latest Telugu News