BJP vs Congress: బీజేపీ vs కాంగ్రెస్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓటు షేర్ ఎంత?
ABN, Publish Date - Jun 05 , 2024 | 06:29 PM
‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి (BJP) గట్టి షాక్ తగిలింది. తాము వేసిన అంచనాలకు భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో..
‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి (BJP) గట్టి షాక్ తగిలింది. తాము వేసిన అంచనాలకు భిన్నంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ఖంగుతింది. 2014, 2019 ఎన్నికల్లో దేశ ప్రజలు తమకు భారీ సీట్లతో అధికారాన్ని కట్టబెట్టడంతో.. ఈసారి ‘అంతకుమించి’ సీట్లు రావడం పక్కా అని ఆ పార్టీ భావించింది. కానీ.. ఆ అంచనాలన్ని బోల్తాపడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ (Congress) నుంచి గట్టి పోటీనే ఎదురైంది. గత రెండు ఎన్నికల్లో 50కి (2014: 44, 2019: 52) అటుఇటుగా మాత్రమే సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఈసారి సెంచరీ మార్క్ (99)ని చేరింది. అంటే.. గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య గణనీయంగానే పెరిగింది. ఈ నేపథ్యంలోనే.. ఆ రెండు జాతీయ పార్టీలకు ఎంత ఓటింగ్ శాతం నమోదైంది? వ్యత్యాసం ఎంత? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీ vs కాంగ్రెస్ ఓటు షేర్
ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 36.6 శాతం ఓట్లు పడ్డాయి. 2019లో నమోదైన 37.3 శాతంతో పోలిస్తే.. ఈసారి 0.70 ఓటింగ్ షేర్ మాత్రమే తగ్గింది. ఒకరకంగా చెప్పాలంటే.. ఇదేమీ భారీ తగ్గుదల కాదు. కానీ.. సీట్ల పరంగా మాత్రం బీజేపీకి పెద్ద గండి పడిందని చెప్పుకోవచ్చు. 2019లో 303 సీట్లు సాధించిన బీజేపీ.. 2024లో కేవలం 240 సీట్లే సొంతం చేసుకోగలిగింది. అంటే.. గతంలో పోలిస్తే ఏకంగా 63 స్థానాలను కోల్పోయింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా 32 సీట్లు తక్కువ వచ్చాయి కాబట్టి.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గాను బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి అయ్యింది.
Read Also: పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం.. బైక్‌పై మాట్లాడుతుండగా ముగ్గురు దూసుకొచ్చి..
ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 21.2 శాతం ఓట్లు సాధించింది. 2019లో నమోదైన 19.5 శాతంతో పోలిస్తే.. ఈసారి 1.7 శాతం ఓట్లు పెరిగాయి. ఈ ఓటింగ్ షేర్ పెరిగింది తక్కువే అయినప్పటికీ.. సీట్లు మాత్రం రెండింతలు ఎగబాకాయి. 2019లో కేవలం 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్.. ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో 99 సీట్లు కైవసం చేసుకోగలిగింది. కాంగ్రెస్‌కు ఇలా సీట్లు పెరగడం, ఇండియా కూటమిలోని మిత్రపక్షాల్లోని కొన్ని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించడంతో.. బీజేపీకి సీట్లు చాలా తగ్గాయి. దీంతో.. ఎన్డీఏలోని మిత్రపక్షాలే ప్రభుత్వ ఏర్పాటుకు అత్యంత కీలకంగా మారారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 05 , 2024 | 06:29 PM