Share News

Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:44 AM

సుప్రీం న్యాయమూర్తిగా ఆరేళ్లలో 117 తీర్పులిచ్చారు. 456 తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీం సీజేఐ పదవికి ఎంపికయ్యారు.

 Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ
Justice sanjiv Khanna

ఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 10న సుప్రీం సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత సుప్రీం కోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పేరుంది. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నాను ప్రధాన న్యాయమూర్తి పదవికి ప్రతిపాదించారు. సుప్రీం న్యాయమూర్తిగా ఆరేళ్లలో 117 తీర్పులిచ్చారు. 456 తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీం సీజేఐ పదవికి ఎంపికయ్యారు.


సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం..

1960 మే 14న జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని హజరీ కాంప్లెక్స్‌లో జిల్లా కోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునళ్లకు మారి 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటొరీ స్టాండింగ్ కౌన్సిల్, ఇన్‌కమ్ ట్యాక్స్ స్టాండింగ్ సీనియర్ కౌన్సిల్‌గా, ఢిల్లీ హైకోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా, క్రిమినల్ కేసుల్లో అమికస్ క్యూరీగా వ్యవహరించి 2005లో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. ఆయన ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్, డిస్ట్రిక్ట్ కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రాలకు ఛైర్మన్‌గా పని చేసి 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


కీలక తీర్పులు..

సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని కొనసాగించడం. ఈ పరికరాలు సురక్షితమైనవని, బూత్ క్యాప్చరింగ్, ఫేక్ ఓటింగ్‌ను తొలగిస్తాయని ఆయన తీర్పునిచ్చారు. ఏప్రిల్ 26న జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈవీఎం తారుమారు అనుమానాన్ని “నిరాధారమైనది” అని పేర్కొంది. పాత పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి మార్చాలనే డిమాండ్‌ను తిరస్కరించింది. ఇది కాకుండా, రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్ ఖన్నా కూడా ఒకరు. గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం 2019లో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లోనూ జస్టిస్ ఖన్నా భాగం. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుల్లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తొలిసారిగా అప్పటి సీఎం కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.

Yamuna River Pollution: యమునా నదిలో విషం..! స్నానం చేస్తే అంతేనా ..! |


Updated Date - Nov 11 , 2024 | 12:09 PM