National : బీజేపీ కొత్త సారథి ఎవరు?
ABN, Publish Date - Jun 10 , 2024 | 04:09 AM
కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో బీజేపీలో సంస్థాగతంగా మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను క్యాబినెట్‌లోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో ఎవరికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తిదాయకంగా మారింది.
క్యాబినెట్‌లోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
కేంద్ర మంత్రివర్గం ఏర్పాటుతో మారుతున్న సమీకరణలు
క్యాబినెట్‌లోకి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా
న్యూఢిల్లీ, జూన్ 9: కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో బీజేపీలో సంస్థాగతంగా మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను క్యాబినెట్‌లోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో ఎవరికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తిదాయకంగా మారింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, హరియాణా మాజీ సీఎం ఖట్టర్‌లలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా నియమించవచ్చని ఊహాగానాలు వెలువడినప్పటికీ.. వారిద్దరిని కూడా కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోవటంతో వాటికి తెరపడింది. దీంతో బీజేపీ కొత్త సారథి ఎవరన్న చర్చ కొనసాగుతోంది. మరోవైపు, ఒడిశాలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ అక్కడ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తుందన్న అంశం కూడా కొంతకాలంగా హాట్‌టాపిక్‌గా మారింది.
ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆ అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొన్నప్పటికీ.. ఆయనకు కూడా మోదీ టీంలో స్థానం లభించటంతో ఒడిశా సీఎం పదవిపై సస్పెన్స్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్ బీజేపీ నేత సురేశ్ పుజారీ పేరు తెరపైకి వచ్చింది. సురేశ్ పుజారీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావటంతో సీఎం పదవి పుజారీనే వరించనుందని పలువురు భావిస్తున్నారు. ఈ నెల 11న ఒడిశా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. దీంట్లో సీఎం ఎవరనేది తేలనుంది. కేంద్ర మంత్రివర్గంలో మళ్లీ అవకాశం లభించిన పలువురు మంత్రుల శాఖలు మారుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి.
Updated Date - Jun 10 , 2024 | 04:09 AM